Medaram Jatara: మేడారం జాతరపై ఫోకస్..
ముమ్మరంగా కొనసాగుతున్న రోడ్ల మరమ్మత్తు పనులు
మహా కుంభమేళాగా జరిగే మేడారం జాతరకు (Medram Jatara) సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో అధికారులు రహదారుల మరమ్మతులు, ఇతర ఏర్పాట్లు ముమ్మరం చేశారు. దేశ నలుమూల నుంచే తరలివచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం సమ్మక్క సారలమ్మ జాతర ఈ నెల 21 నుంచి 24 వరకు అంగరంగ వైభవంగా జరగనుంది. ఈజాతరకు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తారు. అయితే జాతర ప్రారంభం అవటానికి రెండువారాలే సమయం ఉన్నా....రహదారి మరమ్మతులు ఇతర పనులు ఇంకా కొనసాగుతునే ఉన్నాయి. రహదారులు సరిగా లేకపోవడంతో భక్తులు ఇబ్బంది పడుతున్నారు. జాతర సమయానికల్లా పనులు పూర్తి కాకపోతే.......ట్రాఫిక్ సమస్యలు తలెత్తే అవకాశాలున్నాయి. జాతర సయయంలో....అన్ని దారులు మేడారం వైపే అన్నట్లుగా జనసందోహం ఉంటుంది కాబట్టి......త్వరగా రహదారి మరమ్మతు పనులు పూర్తి చేయాలని భక్తులు కోరుతున్నారు. సకాలంలో పనులు పూర్తి చేస్తామని మంత్రి సీతక్క వెల్లడించారు.
జాతరలో పారిశుద్ధ్య సేవల కోసం తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి పారిశుద్ధ్య కార్మికులను తీసుకొస్తున్నారు. రాజమహేంద్రవరంకి చెందిన 250 మంది కూలీలను తీసుకొచ్చి పనులు చేయిస్తున్నారు. అలాగే మేడారం జాతరకు వచ్చే భక్తులు సాంప్రదాయంగా జంపన్న వాగులో పుణ్యస్నానాలు ఆచరించి తలనీలాలు సమర్పించుకుంటారు. స్నానాలు చేసే భక్తులు ఇబ్బందులు పడకుండా గన్నీ బ్యాగుల్లో ఇసుక నింపి జంపన్న వాగులో తాత్కాలిక చెక్ డ్యాం నిర్మిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
జాతర వద్ద విద్యుత్ సరఫరా పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. సుమారు 16 కోట్ల 34 లక్షల రూపాయల అంచనాలతో విద్యుత్ శాఖ అధికారులు ట్రాన్స్‌ఫార్మర్లు, కరెంటు లైన్లను ఏర్పాట్లు చేస్తున్నారు. 500 మంది అధికారులు, సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. 10 ఎకరాల విస్తీర్ణంలో మేడారం బస్టాండ్, విద్యుత్తు స్తంభాల నిర్మాణం పనులు రెండు మూడు రోజుల్లో పూర్తి కానున్నాయని విద్యుత్ శాఖ అధికారులు వెల్లడించారు. మహా జాతర సందర్భంగా భక్తులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు