Medico Preethi : శోకసంద్రంలా గిర్ని తండా, ప్రీతి అంత్యక్రియలు పూర్తి
జనగాం జిల్లా కోడకండ్ల మండలం గిర్నితండా గ్రామంలో అంత్యక్రియలు జరిగాయి. ప్రీతిని చివరిసారిగా చూసేందుకు జనం తండోపతండాలుగా వచ్చారు;
సీనియర్ల వేధింపులతో ఆత్మహత్య చేసుకున్న మెడికో విద్యార్ధి ప్రీతి అంత్యక్రియలు ముగిశాయి. జనగాం జిల్లా కోడకండ్ల మండలం గిర్నితండా గ్రామంలో అంత్యక్రియలు జరిగాయి. ప్రీతిని చివరిసారిగా చూసేందుకు జనం తండోపతండాలుగా వచ్చారు. గిరిజన సంఘాల నినాదాలు, ఆందోళనలు, కుటుంబ సభ్యుల అశ్రునయనాల మధ్య అంత్యక్రియలు ముగిసాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ప్రీతి మరణంతో ఆమె కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు విలపిస్తున్నారు. అంతా కూడా శోకసంద్రంలా మారిపోయింది.
నిమ్స్‌లో అయిదు రోజులుగా మృత్యువుతో పోరాడిన ప్రీతి ఆదివారం కన్నుమూసింది. నిమ్స్‌లో చేరినప్పటి నుంచి ప్రాణాపాయ స్థితిలోనే ఉన్న ఆమె రాత్రి 9.10 గంటలకు మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ప్రీతి మరణంపై ఆమె తండ్రి అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
ఇది నూటికి నూరుశాతం హత్యేనన్నారు ప్రీతి సోదరి. ప్రీతిని హత్య చేసి కవర్ చేస్తున్నారన్నారు. దీనిపై సమగ్ర విచారణ చేయాలని డిమాండ్ చేశారు. ఇది ఒక్కరు చేసిన పని కాదని...ఇందులో అనేక మంది పాత్ర ఉందన్నారు. సీనియర్స్ అంతా కలిసి ప్రీతిని వన్‌సైడ్ చేశారని... క్యాస్ట్ గురించి చెబుతూ ప్రీతిని తక్కువ చేశారని, ప్రాణం తీశారని అన్నారు ప్రీతి సోదరి.