మీర్‌పేట్ లో భార్య మాధవిని ముక్కలుగా నరికి పొడి చేసిన ఘటనలో నిందితుడు గురుమూర్తిని పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. భార్యను కిరాతకంగా చంపిన నిందితుడు పక్కా ప్రణాళిక ప్రకారం వ్యవహరించి పోలీసులను ముప్పు తిప్పలు పెట్టాడు. వారం రోజులుగా విచారిస్తున్నా అతను సమాధానం చెప్పలేదు. దీంతో ఫోరెన్సిక్ నిపుణుల సాయంతో పోలీసులు కచ్చితమైన ఆధారాలను సేకరించారు. ఈ క్రమంలోనే గురుమూర్తిని అదుపులోకి తీసుకున్నారు.
మీర్‌పేట్‌లో భార్యను ముక్కలుగా నరికిన గురుమూర్తి గురించి అతడి సహోద్యోగులు ఆసక్తికర విషయాలు బయటపెట్టారు. నిందితుడు పనిచేసే డీఆర్‌డీఓలో పోలీసులు విచారించారు. ‘గురుమూర్తి ఎంతో క్రమశిక్షణతో ఉంటాడు. ఎవరైనా సాయం అడిగితే కాదనడు. ఆయనది మెతక వైఖరి. ప్లాస్టిక్ వస్తువులు వాడేందుకు ఇష్టపడడు. కాఫీ, భోజనానికి కూడా స్టీల్ పాత్రలు ఉపయోగించేవాడు. ఇరుగుపొరుగుతో ఎక్కువగా మాట్లాడడు’ అని సహోద్యోగులు తెలిపారు.