"తెలంగాణ వ్యవసాయాన్ని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లడమే లక్ష్యం"

Update: 2023-08-30 13:12 GMT

తెలంగాణ వ్యవసాయాన్ని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లడమే లక్ష్యమన్నారు మంత్రి నిరంజన్‌రెడ్డి. భవిష్యత్‌ తరాలు వ్యవసాయాన్ని వృత్తిగా స్వీకరించే పరిస్థితులు రావాలన్నారు. అమెరికాలో పర్యటిస్తున్న ఆయన.. అక్కడ అత్యంత అధునాతన వ్యవసాయ క్షేత్రాల్లో ఒకటిగా పేరుగాంచిన లాంగ్ వ్యూ ఫార్మ్‌ను సందర్శించారు. 1950లో కెన్నెత్, లూయిస్ జంట మొదలుపెట్టిన ఈ వ్యవసాయ క్షేత్రం.. ఇప్పుడు వారి మునిమనవలైన నాలుగో తరం నడిపిస్తుండటం విశేషమన్నారు. అమెరికాలో వ్యవసాయ పరిస్థితులు భారతదేశ వ్యవసాయంతో పోలిస్తే కొంత భిన్నమని పేర్కొన్నారు. ఇక్కడి రైతులకు ప్రభుత్వ ప్రోత్సాహకాలు కూడా మనదేశానికి భిన్నంగా ఉన్నాయని చెప్పారు. ఇక్కడి రైతులు కొంత కార్పొరేటీకరణ వల్ల ప్రభుత్వం మీద పెద్దగా అధారపడటం లేదని తమ అధ్యయనంలో అర్ధమైందన్నారు.

రానున్న రోజుల్లో తెలంగాణ రైతాంగం కూడా యంత్ర శక్తిని విరివిగా వినియోగించుకోవడానికి అవసరమయ్యే.. ప్రణాళికలతో ముందుకు సాగుతున్నామని నిరంజన్‌రెడ్డి అన్నారు. దేశానికే ఆదర్శంగా నిలిచిన తెలంగాణ వ్యవసాయ విధానాలు.. తెలంగాణ రాష్ట్రంలో రైతుల ఆదాయం, సంక్షేమం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేస్తున్నారన్నారు. వ్యవసాయానికి ఉచిత విద్యుత్, రైతుబంధు లాంటి పథకాలు, కాళేశ్వరం ప్రాజెక్ట్ వంటి సాగునీటి ప్రాజెక్టుల ద్వారా తెలంగాణలో వ్యవసాయ ముఖచిత్రం పూర్తిగా మారిపోయిందన్నారు. మన తెలంగాణ రైతుల ప్రగతి మరో మెట్టుకు చేరాలంటే.. ఆధునిక వ్యవసాయ పద్ధతులను అనుసరించాలన్నారు. ప్రపంచవ్యాప్తంగా వ్యవసాయ రంగంలో శాస్త్ర సాంకేతిక విషయాల్లో జరుగుతున్న అభివృద్ధిని.. తెలంగాణ రైతులకు అందచేయడమే అమెరికా పర్యటన ప్రధాన లక్ష్యమన్నారు.

రైతులు ఆధునిక పద్ధతులు పాటిస్తే సాగు ఖర్చు తగ్గుతుందని.. ఉత్పత్తి అధికంగా రావడంతో పాటు, ఉత్పత్తి నాణ్యత కూడా పెరుగుతుందని చెప్పారు. కేవలం వ్యవసాయంపై ఆధారపడటమే కాకుండా, వ్యవసాయంతో ముడిపడి ఉన్న పశువుల పెంపకం, కోళ్ల పరిశ్రమ లాంటి వ్యవసాయ అనుబంధ రంగాలపై కూడా వ్యవసాయదారులు దృష్టి పెట్టాలని నిరంజన్‌రెడ్డి కోరారు. 

Tags:    

Similar News