TS : వచ్చే పంట నుంచి వరికి రూ.500 బోనస్: మంత్రి ఉత్తమ్

Update: 2024-05-11 06:32 GMT

ఆగస్టు 15లోపు రూ.2లక్షల రైతు రుణమాఫీ చేస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మరోసారి స్పష్టం చేశారు. వానాకాలం నుంచి పండిన వరికి క్వింటాకు రూ.500 చొప్పున బోనస్ ఇస్తామని ప్రకటించారు. గత అక్టోబర్‌లోనే మేడిగడ్డ కుంగిందని, అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం అందులోని నీళ్లు వదిలిపెట్టిందన్నారు. వర్షాకాలంలోనూ బ్యారేజీల్లోని నీటిని దిగువకు వదలాలన్న డ్యాం సేఫ్టీ అథారిటీ ఆదేశాలతో ముందుకెళ్తున్నట్లు ఉత్తమ్ చెప్పారు.

సాగునీటిపారుదల, విద్యుత్‌ రంగాల్ని కేసీఆర్‌ సర్వనాశనం చేశారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. కాళేశ్వరం విషయంలో జరిగిన తప్పులకు కేసీఆర్‌ ప్రజలకు క్షమాపణ చెప్పకుండా ఉచిత సలహాలు ఇస్తున్నారని మండిపడ్డారు. గత అక్టోబరులోనే మేడిగడ్డ బ్యారేజీ కూలిందని... అందులో నీళ్లు వదిలిపెట్టింది అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వమేనన్నారు. ఆ తర్వాత నేషనల్‌ డ్యాం సేఫ్టీ అథారిటీ పరిశీలించి అన్ని బ్యారేజీలను ఖాళీ చేయాలని సూచించిందని తెలిపారు.

వర్షాకాలంలోనూ అన్ని బ్యారేజీల గేట్లను పైకెత్తి నీళ్లను వదిలిపెట్టాలని తెలిపిందన్నారు. ఆ మేరకే ప్రభుత్వం ముందుకెళుతుందని చెప్పారు. పదేళ్ల పాలనలో కేసీఆర్‌ నేర్పిన విద్యను అందరూ నేర్చుకున్నారని.. ఉన్న ఎమ్మెల్యేల్లో కొందరు అటూఇటూ చూస్తున్నారు. నల్గొండ లోక్‌సభ స్థానంలో 5 లక్షల మెజార్టీ లక్ష్యంతో పనిచేస్తున్నామని వెల్లడించారు.

Tags:    

Similar News