గాంధీ ఆస్పత్రిలో అదృశ్యమైన యువతి ఆచూకీ లభ్యం..!
హైదరాబాద్ గాంధీ ఆస్పత్రిలో అదృశ్యమైన యువతి ఆచూకీ ఎట్టకేలకు తెలిసింది. నారాయణగూడ సమీపంలో తిరుపతమ్మను గుర్తించిన పోలీసులు వెంటనే నార్త్‌జోన్ డీసీపీ కార్యాలయానికి తరలించారు.;
హైదరాబాద్ గాంధీ ఆస్పత్రిలో అదృశ్యమైన యువతి ఆచూకీ ఎట్టకేలకు తెలిసింది. నారాయణగూడ సమీపంలో తిరుపతమ్మను గుర్తించిన పోలీసులు వెంటనే నార్త్‌జోన్ డీసీపీ కార్యాలయానికి తరలించారు. ఈనెల 11వ తేదీ నుంచి కనిపించకుండా పోయిన తిరుపతమ్మ ఇన్నాళ్లూ ఎక్కడుంది..! గాంధీ ఆస్పత్రిలో ఆ రోజు ఏం జరిగింది అనేదానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. అక్కా చెల్లెళ్లపై ఆస్పత్రిలోనే అత్యాచారం జరిగిందన్న ఫిర్యాదు నేపథ్యంలో.. ఇప్పటికే పలువురు అనుమానితుల్ని పోలీసులు ప్రశ్నించారు. ల్యాబ్ టెక్నీషియన్ ఉమామహేశ్వరరావు, సెక్యూరిటీ సిబ్బందిని విచారించినా తమకు ఏమీ సంబధం లేదనే చెప్తున్నారు.
అటు, తిరుపతమ్మ సోదరి విచారణలో పొంతనలేని మాటలు చెప్తుండడం, ఇటు చూస్తే తిరుపతమ్మ వారం రోజులుగా కనిపించకుండా పోవడంతో ఈ కేసు మరింత జటిలంగా మారింది. చివరికి తిరుపతమ్మను గుర్తించిన పోలీసులు.. ఆస్పత్రిలో ఏం జరిగిందనే దానిపై ప్రశ్నిస్తున్నారు. ఆస్పత్రిలోనే అత్యాచారం అనే విషయం సంచలనం కావడంతో ఈ కేసు సీరియస్‌గా తీసుకున్న పోలీసులు దాదాపు 60 మందిని ప్రశ్నించారు. కానీ ఎక్కడా ఎలాంటి క్లూ దొరకలేదు. ఆస్పత్రి సీసీ ఫుటేజ్ కూడా పరిశీలించారు. ఫోరెన్సిక్ టీమ్ కూడా రంగంలోకి దిగింది. బాధిత మహిళకు మత్తుమందు ఇచ్చి అత్యాచారం చేశారనే వార్తలు రావడంతో బ్లడ్ శాంపిల్స్ తీసుకుని పరీక్షలు చేశారు.
ఐతే.. టెస్టుల్లో క్లోరోఫామ్, ఇతర మత్తు పదార్థాల ఆనవాళ్లేమీ లేకపోవడంతో ఆమె చెప్తున్న దాంట్లో నిజం ఎంత అనేది అర్థంకాని పరిస్థితి. ఇప్పుడు తిరుపతమ్మ కూడా దొరకడంతో ఇద్దర్నీ ప్రశ్నిస్తున్న పోలీసులు.. వారి స్టేట్‌మంట్ రికార్డు చేస్తున్నారు. మహబూబ్‌నగర్ నుంచి గాంధీ హాస్పిటల్‌కు వచ్చి అక్కడ కిడ్నీ ట్రీట్‌మెంట్ తీసుకుంటున్న రోగికి సహాయకులుగా ఉంటున్న వాళ్లిద్దరూ ఉన్నట్టుండి కనిపించకుండా పోవడం కలకలం రేపింది. నాలుగు రోజుల కిందట చెల్లి ఆచూకీ దొరికినా తిరుపతమ్మ ఎక్కడికెళ్లిందో తెలుసుకునేందుకు చాలా కష్టపడాల్సి వచ్చింది. సోదరి చెప్తున్నట్టు వీరిపై అత్యాచారం జరిగిందా.. అసలేం జరిగింది అనేదానిపై విచారణ కొనసాగుతోంది.