Jaggareddy Resign :ఇకపై నేను ఇండిపెండెంట్‌గా ఉండి ఎవరినైనా కలుస్తా: జగ్గారెడ్డి
Jaggareddy Resign : తెలంగాణ కాంగ్రెస్‌లో సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి వ్యవహారం కాకరేపుతోంది.;
Jaggareddy Resign : తెలంగాణ కాంగ్రెస్‌లో సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి వ్యవహారం కాకరేపుతోంది. సంగారెడ్డి నియోజకవర్గ ముఖ్య నాయకులతో సమావేశమైన ఆయన ఆయన... పార్టీని వీడనున్నట్లు ప్రకటించారు. పార్టీలో తనకు అవమానాలు జరుగుతున్నాయని జగ్గారెడ్డి చాలాకాలంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది పొమ్మనలేక పొగబెడుతున్నారని మండిపడ్డారు. కావాలనే తనపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేస్తున్నారని.. తనను టీఆర్‌ఎస్ కోవర్టు అంటూ అవమానిస్తున్నారంటూ పలుమార్లు చెప్పుకొచ్చారు. నాపై ఉన్న బురద పోగొట్టుకోవడానికే పార్టీని వీడుతున్నన్నారు.
రాజీనామా యోచనలో ఉన్న జగ్గారెడ్డికి కాంగ్రెస్ సీనియర్ నేతలు బుజ్జగించారు. ఆయన అలక విషయం తెలియగానే కాంగ్రెస్ సీనియర్ నేతలు జగ్గారెడ్డి ఇంటికి వెళ్లి సీనియర్ నేత వీహెచ్ సహా పలువురు ఆయన వాదను విన్నారు. నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. పీసీసీ ప్రధాన కార్యదర్శి బొల్లి కిషన్... ఏకంగా జగ్గారెడ్డి కాళ్లు పట్టుకుని బ్రతిమిలాడారు. అయితే తనకు పార్టీలో గౌరవం లేదని... ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కోని నిలబడ్డా... అవమానాలు తప్పలేదని ఆవేదన వ్యక్తం చేశారు. 3-4 రోజుల్లో సీనియర్లను అందర్నీ ఒప్పించి, రాజీనామా ఆమోదించుకుంటానన్నారు. ఇక ఒక ఎమ్మెల్యేగా సీఎంను, మంత్రిని కలిస్తే తప్పేంటని ప్రశ్నించారు. నియోజకవర్గంలో ప్రజాసమస్యలపై మంత్రిని కలిస్తే తప్పుడు ప్రచారం చేశారని మండిపడ్డారు.
కాంగ్రెస్ అధిష్టానానికి లేఖ రాశారు ఎమ్మెల్యే జగ్గారెడ్డి. తనకు జరిగిన అవమానాన్ని వివరిస్తూ సోనియా, రాహుల్ గాంధీకి లెటర్ రాశారు. త్వరలో రాజీనామా పత్రాన్ని కూడా పంపిస్తానన్నారు. లేఖ రాసిన క్షణం నుంచి నేను కాంగ్రెస్ పార్టీలో లేనట్లేనన్నారు జగ్గారెడ్డి. మరోవైపు జగ్గారెడ్డి టీఆర్‌ఎస్‌లోకి వెళ్తారంటూ జోరుగా ప్రచారం జరుగుతున్నప్పటికీ.. ఏ పార్టీలో చేరబోరని జగ్గారెడ్డి క్లారిటీ ఇచ్చారు. ఇండిపెండెంట్‌గానే రాజకీయాల్లో ఉంటానని... రాజీనామా చేసినా సోనియా గాంధీ పట్ల విధేయతతో ఉంటానన్నారు. ఇక తనతో కలిసి బయటకు వచ్చేవాళ్లను ఆహ్వానిస్తానన్నారు.