TG: ఎమ్మెల్యే కాలేజీలను కూడా కూల్చేస్తారా..?

ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డికి రెవెన్యూ అధికారుల షాక్‌... అక్రమ నిర్మాణాలు తొలగించాలని తాఖీదులు;

Update: 2024-08-29 08:00 GMT

ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డికి రెవెన్యూ అధికారులు షాక్‌ ఇచ్చారు. ఎమ్మెల్యే, ఆయన తండ్రి మర్రి లక్ష్మణ్‌రెడ్డిలు నిర్వహిస్తున్న మర్రి లక్ష్మణ్‌రెడ్డి ఇంజినీరింగ్‌ కళాశాలల నిర్మాణాలు, ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఏరోనాటికల్‌ ఇంజినీరింగ్‌ కళాశాలలు దుండిగల్‌ పరిధిలోని చిన్నదామెర చెరువు ఎఫ్‌టీఎల్, బఫర్‌జోన్ల పరిధిలో ఉన్నాయని.. 7 రోజుల్లో వాటిని తొలగించాలంటూ గండిమైసమ్మ-దుండిగల్‌ తహసీల్దార్‌ ఈ నెల 22న నోటీసులు జారీచేశారు. దుండిగల్‌ పరిధిలోని చిన్నదామెర చెరువు ఎఫ్‌టీఎల్, బఫర్‌జోన్ల పరిధిలో ఈ విద్యాలయాలు ఉన్నాయని.. 7 రోజుల్లో వాటిని తొలగించాలంటూ గండిమైసమ్మ-దుండిగల్‌ తహసీల్దార్‌ ఈ నెల 22న నోటీసులు జారీచేశారు. చిన్నదామెర చెరువు ఎఫ్‌టీఎల్, బఫర్‌జోన్లలో 8.24 ఎకరాలు ఆక్రమించారని, వారం రోజుల్లో ఆక్రమణలను తొలగించకపోతే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామంటూ దుండిగల్‌ తహసీల్దార్‌ సయ్యద్‌ మతిన్‌ పేర్కొన్నారు. నోటీసుల్లో పేర్కొన్న గడువు గురువారంతో ముగుస్తున్న నేపథ్యంలో రెండు సంస్థలు హైకోర్టును ఆశ్రయించాయి.

హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలో 13 చెరువులను ఆక్రమించారని, వాటిలో భారీగా అక్రమ నిర్మాణాలు చేపట్టారంటూ 14 ఏళ్ల క్రితం అనిల్‌ సి.దయాకర్‌ అనే వ్యక్తి హైకోర్టులో రిట్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. ఆక్రమణదారులు పర్యావరణానికి హాని చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు 13 చెరువుల్లో స్థితిగతులపై నివేదిక ఇవ్వాలంటూ ఇటీవల ఆదేశాలు జారీ చేసింది. ఈ చెరువుల్లో చిన్నదామెర చెరువు కూడా ఉండగా.. హైకోర్టు ఆదేశాల మేరకు రెవెన్యూ, ఇరిగేషన్‌ అధికారులు సంయుక్తంగా సర్వే చేసి గత నెల హైకోర్టుకు నివేదికను సమర్పించారు. పరిశీలించిన హైకోర్టు అదనపు అడ్వొకేట్‌ జనరల్‌ చెరువులో అక్రమ నిర్మాణాలను తొలగించాలంటూ ఈ నెల 2న దుండిగల్‌ తహసీల్దార్‌కు లేఖ రాశారు. దీంతో రెవెన్యూ, ఇరిగేషన్‌ అధికారులు మరోసారి సర్వేచేసి.. అక్రమ నిర్మాణాలున్నాయని గుర్తించి మర్రి లక్ష్మణ్‌రెడ్డి, ఏరోనాటికల్‌ ఇంజినీరింగ్‌ కళాశాలలకు వేర్వేరుగా ఈ నెల 22న నోటీసులు జారీ చేశారు.

రెవెన్యూ అధికారులు సేకరించిన సమాచారం ప్రకారం.. మర్రి లక్ష్మణ్‌రెడ్డి, ఏరోనాటికల్‌ ఇంజినీరింగ్‌ కళాశాలలు చిన్నదామెర చెరువు ఎఫ్‌టీఎల్, బఫర్‌జోన్లలో ఉన్నాయి. ఒక ఎకరాలో బహుళ అంతస్తుల శాశ్వత భవనాలు నిర్మించగా.. వాహనాల పార్కింగ్‌ కోసం మూడు ఎకరాలు అక్రమించారు. చెరువు బఫర్‌జోన్‌ను పూర్తిగా చదునుచేశారు. వర్షం కురిసినా, ఎలాంటి ఇబ్బందులు కలగకుండా గట్టిగా ఉండేలా పార్కింగ్‌ ప్రాంతాన్ని మార్చారు. రెండు దశాబ్దాలుగా మర్రి లక్ష్మణ్‌రెడ్డి ఇంజినీరింగ్‌ కళాశాల కొనసాగుతోందని, కొన్నేళ్ల తర్వాత ఏరోనాటికల్‌ ఇంజినీరింగ్‌ కళాశాలలు ప్రారంభించినట్టు రెవెన్యూ అధికారులు సమాచారాన్ని సేకరించారు.

Tags:    

Similar News