MLA Shakeel: జూబ్లీహిల్స్ కారు యాక్సిడెంట్ కేసులో వీడిన మిస్టరీ.. ఎమ్మెల్యే షకీల్ కుమారుడు కూడా..
MLA Shakeel: ఇద్దరిని అరెస్టు చేసామన్న ఏసీపీ సుదర్శన్.. పరారీలో ఉన్న రాహిల్ కోసం గాలిస్తున్నామని తెలిపారు.;
MLA Shakeel: తెలంగాణలో సంచలనం సృష్టించిన హైదరాబాద్ జూబ్లీహిల్స్ కారు ప్రమాదం కేసులో పోలీసులు పురోగతి సాధించారు. రెండు నెలల బాలుడు మృతికి కారణమైన నిందితులను జూబ్లీహిల్స్ పోలీసులు గుర్తించారు. ప్రమాద సమయంలో సంతోష్‌నగర్‌కు చెందిన అఫ్నాన్, నాజ్‌లతో పాటు బోధన్ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు రాహిల్ కూడా ఉన్నట్లు ఏసీపీ సుదర్శన్ తెలిపారు.
ఆఫ్నాన్ కారు నడిపారని.. ప్రమాదానికి అతనే కారణమన్నారు. ఇద్దరిని అరెస్టు చేసామన్న ఏసీపీ సుదర్శన్.. పరారీలో ఉన్న రాహిల్ కోసం నాలుగు టీమ్‌లతో గాలిస్తున్నామని తెలిపారు. నిర్లక్ష్యపు డ్రైవింగ్, అతివేగమే ప్రమాదానికి కారణమన్నారు. ఘటనా స్థలంలో సీసీ కెమెరాలు పనిచేయకపోవడం దర్యాప్తునకు ఆటంకం కలుగుతోందని ఏసీబీ సుదర్శన్ తెలిపారు.
మరోవైపు జూబ్లీహిల్స్ కారు ప్రమాదం నిన్న బోధన్ ఎమ్మెల్యే షకీల్ స్పందించారు. ఆక్సిడెంట్ చేసిన కారు తనది కాదని, తన బంధువు మీర్జాది అని చెప్పారు. అంతేకాదు అప్పుడప్పుడు ఆ కారును తాను ఉపయోగిస్తుంటానని అందుకే ఎమ్మెల్యే స్టిక్కర్ వేసినట్లు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే షకీల్ చెప్పడంతో రాజకీయ దుమారం రేగింది.
తన కుమారుడిని కేసు నుంచి తప్పించేందుకు ఎమ్మెల్యే షకీల్ ప్రయత్నిస్తున్నారని ప్రతిపక్షాలు ఆరోపించాయి. ఈనెల 17 రాత్రి జూబ్లీహిల్ రోడ్‌నెంబర్ 45లో మహీంద్రా థర్ కారు బీభత్సం సృష్టించింది. బోధన్ ఎమ్మెల్యే షకీల్ పేరుతో స్టిక్కర్ వేసి ఉన్నకారు... వేగంగా వచ్చిన రోడ్డు దాటుతున్న వారిని ఢీకొట్టింది. దీంతో రోడ్డుపక్కన బెలూన్లు విక్రయిస్తూ జీవించే కాజల్, చౌహాన్, సుష్మభోన్నేలు గాయపడ్డారు.
కారు వేగంగా ఢీకొట్టడంతో మహిళ చేతిలోఉన్న రెండు నెలల బాలుడు ఎగిరిపడి ప్రాణాలు కోల్పోయాడు. ప్రమాదం జరిగిన వెంటనే నిందితులు కారును వదిలేసి అక్కడి నుంచి పరార్ అయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు ఇద్దరు మహిళలతో పాటు గాయపడిన మరో బాబును ఆపోలో ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ఆ తర్వాత వారిని నిమ్స్‌లో చేర్పించారు.
అయితే కారు ప్రమాదంలో గాయపడిన కాజల్.. నిమ్స్ ఎమర్జెన్సీలో చికిత్స పొందుతూ మాయం కావడం తీవ్ర కలకలం రేపింది. గాయపడి నడవలేని స్థితిలో ఉన్న బాధితురాలు కనిపించకపోవడంతో పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి. కాజల్ అక్కడినుంచి పారిపోయిందా...? లేక ఎవరైనా బెదిరించి పంపించారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.