శాసనసభ సమావేశాల సమయం విమర్శలకే సరిపోతోందని బీజేపీ ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి అన్నారు. సోమవారం అసెంబ్లీలో ఆయన మాట్లాడారు. సీనియర్ సభ్యులను చూసి కొత్తవాళ్లు నేర్చుకునేలా ఉండాలన్నారు. సభ్యులు హుందాగా వ్యవహరించాలని ఆయన కోరారు. ప్రజా సమస్యలను పక్కన పెట్టి వ్యక్తిగత విమర్శలు చేయడం మంచిది కాదన్నారు. రైతులు ట్రాన్స్‌ఫార్మర్లు కోరితే ఇచ్చే పరిస్థితి లేదన్నారు. గత ప్రభుత్వ హయాంలో కొత్త జిల్లాలను ఏర్పాటు చేశారే తప్ప ఎలక్ట్రిక్ డిపోలు ఏర్పాటు చేయలేదన్నారు. ప్రభుత్వ స్థలమా, ప్రైవేటు స్థలమా అని ఆలోచించకుండా విద్యుత్ లైన్లు వేశారని, గత ప్రభుత్వం చేసిన తప్పిదాలను ఈ సర్కారు సరిదిద్దాలని కోరారు. విద్యుత్ అక్రమాలపై శాసనసభ కమిటీ ద్వారా విచారణ జరిపించాలన్నారు.