Munawar Show : మునావర్ షోకు అంతా రెడీ.. కానీ హై టైన్షన్..
Munawar Show : తెలంగాణలో ఇప్పుడు మునావర్ ఫారూఖీ కామెడీ షో ప్రకంపనలు రేపుతోంది.;
Munuwar Show : తెలంగాణలో ఇప్పుడు మునావర్ ఫారూఖీ కామెడీ షో ప్రకంపనలు రేపుతోంది. ఈ స్టాండప్ కామెడీ షో వద్దేవద్దంటూ కమలం పార్టీ హెచ్చరిస్తోంది. కానీ పోలీసులు మునావర్ షోకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇటు సాయంత్రం హైదరాబాద్ శిల్పకళావేదికలో జరిగే మునావర్ షోకి అన్ని ఏర్పాట్లు చకచక జరిగిపోతున్నాయి. కానీ మునావర్‌ను ఎట్టిపరిస్థితుల్లో అడ్డుకొని తీరుతామని బీజేపీ, హిందూ సంఘాల నేతలు హెచ్చరిస్తున్నారు. దీంతో హైదరాబాద్‌లో హైటెన్షన్ వాతావరణం నెలకొంది.
మునావర్‌ను హైదరాబాద్‌కు ఆహ్వానించారు మంత్రి కేటీఆర్.. కోవిడ్ కారణంగా మునావర్ గతంలో ఇక్కడికి రాలేదు. ఇప్పుడు వస్తుండడంతో కామెడీ షోకు పోలీసులు అనుమతినిచ్చారు. మతంతో సంబంధం లేదని.. కామెడీ షోకు అనుమతిచ్చామని పోలీసులు చెప్పారు. తాము వ్యతిరేకిస్తున్న మునావర్‌ను కేటీఆర్ ఆహ్వానించడం.. హైదరాబాద్ లో షో చేస్తుండడంపై బీజేపీ భగ్గుమంది. హిందువులను కించపరిచే వ్యక్తి కార్యక్రమానికి ఎలా అనుమతిచ్చారంటూ మంత్రి కేటీఆర్‌ను రాజాసింగ్ ప్రశ్నించారు. లా అండ్ ఆర్డర్ డిస్ట్రబ్ అయితే పోలీసులే బాధ్యతవహించాలని హెచ్చరించారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు ఎమ్మెల్యేను ముందస్తుగా అరెస్ట్ చేశారు.
మునావర్ గతంలో స్టాండప్ కామెడీలో రాముడు సీత లాంటి హిందూ దేవుళ్లపై కామెంట్ చేశారని ఆరోపణలున్నాయి. హిందూ దేవుళ్లను అవమానిస్తూ జరిగే మునావర్ షోను చాలా రాష్ట్రాలు రద్దు చేశాయి. ఇటీవలే ఇండోర్, ముంబై, కర్నాటకలోనూ అతడి కార్యక్రమాలను ప్రభుత్వాలు రద్దు చేశాయి. ఇలాంటి షోకు కేటీఆర్ అనుమతివ్వడంపై బీజేపీ భగ్గుమంటోంది. కేటీఆర్ సారీ చెప్పాలని.. మునావర్ షోను అడ్డుకొని తీరుతామని బీజేపీ నేతలు అంటున్నారు.
వివాదాస్పద స్టేండప్ కమిడియన్ మునావర్ ఫరుఖీ హైదరాబాద్ టూర్‌ను హిందూ సంఘాలు కూడా వ్యతిరేకిస్తున్నాయి. కామెడీ షోలలో హిందూ దేవతలను అవమానిస్తున్నారని ఆరోపణలు ఎదుర్కొంటున్న మునావర్.. ఇప్పటికే 16 రాష్ట్రాలు నిషేధించాయి. ఇలాంటి వ్యక్తితో తెలంగాణలో ఎలా షో నిర్వహించుకోనిస్తున్నారని.. ప్రభుత్వంపై ఫైర్ అవుతున్నాయి హిందూ సంఘాలు. రాముడిని, రామాయణాన్ని అవమానించిన మునావర్‌ను.. హైదరాబాద్‌లో అడుగుపెట్టనివ్వబోమని హెచ్చరిస్తున్నారు.
గతంలో మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో షో చేస్తూ హిందూ దేవుళ్లను అవమానించిన మునావార్‌ను అరెస్ట్ చేశారు. ఈ కేసులో 37 రోజులు జైల్లో ఉన్న మునావర్.. సుప్రీంకోర్టు బెయిల్ ఇవ్వడంతో బయటకొచ్చారు. అప్పటి నుంచి హిందూ సంఘాలు, బీజేపీ నేతలు.. మునావర్ షోలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. కొద్ది నెలల క్రితం.. బెంగళూర్, గుర్‌గావ్, రాయ్‌పూర్, సూరత్, అహ్మదాబాద్, వడోదర, గోవా, ముంబైలలో మునావర్ ఫరుఖీ షోలు రద్దయ్యాయి. హిందూ సంఘాల హెచ్చరికలతో నవంబర్ 28న బెంగళూర్‌లో జరగాల్సిన షో కూడా రద్దయ్యింది. మునావర్ చుట్టూ ఇంత వివాదం జరుగుతున్న నేపథ్యంలో టీఆర్ఎస్ ప్రభుత్వం అతని షోకి అనుమతి ఇవ్వడంతో హిందూసంఘాల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
ఇదిలా ఉండగా ఇప్పటికే తమ కార్యకర్తలు ఆ షోకు ఆన్ లైన్ టికెట్లు బుక్ చేసుకున్నారన్నారు. తమ రామసైన్యం మునావర్ షోను అడ్డుకుంటుందని రాజాసింగ్ చెప్పారు. రాముడి బలమెంటో చూపిస్తామని రాజాసింగ్ అనడంతో హైదరాబాద్ లో మునావర్ షోతో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు కనిపిస్తున్నాయి. మరి ఈ వివాదం ఎటువైపుకి దారి తీస్తుందో చూడాలి.