Munugode: మునుగోడు ఎన్నికలు.. ఓటరు చేతికి రూ.14 నుంచి 15 వేలు..
Munugode: మునుగోడులో వేలం పాట నడుస్తోంది. ఎక్కువ ఇచ్చిన పార్టీకే ఓటు అనే రీతిలో మునుగోడులో వాతావరణం ఉండడంతో.. ప్రత్యర్ధిని మించి డబ్బు పంపిణీ చేస్తున్నారు.;
Munugode: మునుగోడులో వేలం పాట నడుస్తోంది. ఎక్కువ ఇచ్చిన పార్టీకే ఓటు అనే రీతిలో మునుగోడులో వాతావరణం ఉండడంతో.. ప్రత్యర్ధిని మించి డబ్బు పంపిణీ చేస్తున్నారు. ఇప్పటికే మునుగోడులో ఓటుకు 3 వేల రూపాయల చొప్పున పంచింది ఓ పార్టీ. గెలుస్తామన్న ధీమాతో ఉన్న ఆ పార్టీ 3వేలు పంచడంతో.. ఎలాగైనా గెలవాలనే లక్ష్యంతో ఉన్న మరోసారి 5వేల రూపాయలు పంచిపెట్టింది.
తన సమీప ప్రత్యర్ధి 5వేల రూపాయలు పంచాడని తెలుసుకున్న ప్రధాన పార్టీ.. ఆల్రడీ ఇచ్చిన మూడువేల రూపాయలకు మరో మూడువేలు కలిపి.. మొత్తం 6వేల రూపాయలు ఇస్తోంది. గెలుపుపై ధీమా లేకపోయినా.. అంతోఇంతో ఆశతో ఉన్న మరో పార్టీ వెయ్యి నుంచి 1500 రూపాయలు పంచుతోంది. మొత్తానికి ఒక్కో ఓటరు చేతికి 14వేల నుంచి 15వేలు అందుతున్నాయి.
కేవలం డబ్బులు చేతిలో పెట్టి వెళ్లిపోవడం లేదు. క్వార్టర్ బాటిల్, కూల్‌డ్రింక్, చికెన్ కూడా పంచుతున్నారు. చౌటుప్పల్ మున్సిపాలిటీలో అయితే ఓటుకొక ఫుల్ బాటిల్ పంపిణీ చేశారు. చౌటుప్పల్‌లో తమ పార్టీకే ఎక్కువ ఓట్లు రావాలనే లక్ష్యం పెట్టుకున్న వరంగల్‌కు చెందిన ఓ ఎమ్మెల్యే.. ఓటుకు ఫుల్ బాటిల్ ఇచ్చారు.
ఇంట్లో ఆడవాళ్లు ఉన్నా సరే.. వాళ్లు కూడా ఓటర్లే కాబట్టి.. వారిని కూడా లెక్కగట్టి ఫుల్ బాటిల్ ఇచ్చొచ్చారు. ఇప్పటికే ఓ ప్రధాన పార్టీ కిలో చొప్పున రెండు సార్లు ఇంటింటికీ చికెన్ పంచింది. ఈ విషయం తెలిసిన రెండో ప్రధాన పార్టీ.. మద్యం, మాంసం పంపిణీకి తెరలేపింది.
ఓటుకో క్వార్టర్, కూల్‌డ్రింక్ పంచడం మొదలుపెట్టింది. ఇలా ఇంటింటికీ తాయిళాలు పంచేందుకే ఒక్కో పార్టీ, ఒక్కో ఇంటికి కనీసం 4వేల రూపాయలు ఖర్చుపెట్టాయి పార్టీలు. దీనికి డబ్బులు అదనం. ఓవరాల్‌గా మునుగోడులో ఒక్కో ఓటరుకు 20వేల రూపాయలు చేతికొచ్చాయి.