హైదరాబాద్ మహా నగరంలో భారీ వర్షాలు కురిసినా తట్టుకునేందుకు వీలుగా వ్యవస్థలన్నింటినీ ప్రక్షాళన చేయాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఆదేశించారు. వరద నీటి ప్రవాహనికి ఉన్న అడ్డంకులను అధిగమించటంతో పాటు భవిష్యత్తు తరాలకు ఉపయోగపడే అభివృద్ధికి వీలుగా పనులు చేపట్టాలని ఆదేశించారు. వర్షాలతో నగరం అతలాకుతలం కాకుండా ఉండేందుకు, జనజీవనం అస్తవ్యస్తం కాకుండా ఉండాలంటే.. అత్యవసరంగానే శాశ్వత అభివృద్ధి పనులు చేపట్టాల్సిన అవసరముందని ముఖ్యమంత్రి అధికారులను అప్రమత్తం చేశారు. తాగునీరు, వరద నీరు, డ్రైనేజీలు, ట్రాఫిక్ వ్యవస్థలను మరో వందేళ్ల భవిష్యత్తు అవసరాలను అంచనా వేసుకొని కొత్త ప్రణాళిక సిద్ధం చేయాలని సీఎం ఆదేశించారు.
ఢిల్లీ నుంచి శుక్రవారం మధ్యాహ్నం హైదరాబాద్ కు చేరుకున్న ముఖ్యమంత్రి నిన్న రాత్రి హైదరాబాద్ లో కురిసిన వర్షం, తలెత్తిన ఇబ్బందులు, అధిగమించేందుకు అనుసరించాల్సిన తక్షణ చర్యలపై అధికారులతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. అన్ని విభాగాల అధికారుల అభిప్రాయాలను తీసుకున్నారు. హైదరాబాద్ లో నిన్న రాత్రి అత్యధికంగా 15 సెంటీమీటర్ల వర్షం కురిసింది. దీంతో ట్రాఫిక్ స్తంభించటంతో పాటు లోతట్టు ప్రాంతాల్లో వరద నీటితో ముంపు పరిస్థితులు ఉత్పన్నమయ్యాయి.
భారీ వర్షం ఒకేసారి కురవటంతో విపత్కర పరిస్థితులు తలెత్తుతున్నాయి. తక్కువ వ్యవధిలో ఎక్కువ వర్షం పడటంతో జనజీవనం అస్తవ్యస్తమవుతోంది. సాధారణంగా మూడు నాలుగు నెలల్లో కురిసే వర్షపాతం మొత్తం ఒకే రోజున కుమ్మరించటంతో నగరం అతలాకుతలమవుతోందని సమావేశంలో చర్చకు వచ్చింది. వాతావరణ మార్పులే అందుకు ప్రధాన కారణమని, అందుకు తగినట్లుగా నగరంలో అన్ని వ్యవస్థలను ఆధునీకరించాల్సిన అవసరముందని సీఎం అభిప్రాయపడ్డారు. హైదరాబాద్ లో ఇప్పుడున్న రోడ్లు, డ్రైనేజీలు అయిదు సెంటీమీటర్ల వర్షం పడితే తట్టుకునే పరిస్థితి లేదని, ఒక్కోసారి 20 సెంటీమీటర్ల వర్షం నమోదవుతోందని అన్నారు.
హైదరాబాద్లో నిన్న రాత్రి కేవలం నాలుగు గంటల వ్యవధిలోనే కొన్ని ప్రాంతాల్లో 15 సెంటీమీటర్ల వర్షపాతం కురిసింది. జూన్ నుంచి ఇప్పటివరకు జీహెచ్ఎంసీ పరిధిలో సాధారణంతో పోలిస్తే 16 శాతం వర్షపాతం ఎక్కువగా నమోదైంది. అందుకే వాతావరణ మార్పులు, భారీ వర్షాలతో తలెత్తే ఈ విపత్కర పరిస్థితులను అధిగమించేందుకు విపత్తుల నివారణ నిర్వహణ ప్రణాళిక సమర్థవంతంగా అనుసరించాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఆదేశించారు.
ఎంత వర్షం పడినా గ్రేటర్ హైదరాబాద్ సిటీలో వర్షపు నీరు నిల్వ ఉండకుండా, వరద నీటితో ముంపు గురవకుండా, లోతట్టు ప్రాంతాల ప్రజలు కూడా సురక్షితంగా ఉండేలా అత్యంత పకడ్బందీ విధానాన్ని అమలు చేయాలని, అందుకు వీలుగా రూపొందిస్తున్న మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టును వెంటనే చేపట్టాలని సీఎం ఆదేశించారు.