TG : తెలంగాణ మంత్రికి నాన్ బెయిలబుల్ వారెంట్...షాక్ ఇచ్చిన నాంపల్లి కోర్టు
తెలంగాణ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి, మాజీ పిసిసి అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డికి నాంపల్లి కోర్టు షాక్ ఇచ్చింది. ఆయనకు నాన్ బెయిలబుల్ వారెంట్ ను జారీ చేసింది. ఎలక్షన్ కోడ్ ను ఉల్లంఘించిన కేసులో కోర్టుకు హాజరు కాకపోవడం పట్ల నాంపల్లి ప్రజా ప్రతినిధుల కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రస్తుతం పొలిటికల్ సర్కిల్లో ఉత్తమ్ అంశం హాట్ టాపిక్ గా మారింది
గత అసెంబ్లీ ఎన్నికల ప్రచార సమయంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా సభ నిర్వహించి, ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించారని ఉత్తమ్ కుమార్ రెడ్డి పై ఆరోపణలు వచ్చాయి. దీంతో పోలీసులు ఆయనపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించి నాంపల్లిలోని ప్రజాప్రతినిధుల కోర్టులో విచారణ జరుగుతోంది.
అయితే, కేసు విచారణకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హాజరు కాకపోవడంతో ఆయన వైఖరిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది కోర్టు. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న మంత్రి సైతం కోర్టు ఆదేశాలను బేఖాతరు చేయడం పట్ల అసహనం వ్యక్తం చేసిన నాంపల్లి కోర్టు ఆయనకు ఏకంగా నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. అనంతరం కేసు విచారణను ఈ నెల 16వ తేదీకి వాయిదా వేసిన ధర్మాసనం ... ఆ రోజున తప్పని సరిగా వ్యక్తిగతంగా విచారణకు హాజరుకావాలని ఆదేశించింది.