ప్రముఖ జ్యోతిషుడు వేణుస్వామి, జర్నలిస్ట్ మూర్తి వివాదంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. వేణుస్వామిపై కేసు నమోదు చేయాలని జూబ్లీహిల్స్ పోలీసులను నాంపల్లి కోర్టు ఆదేశించింది. ప్రజలను జాతకాల పేరుతో ఆయన మోసం చేస్తున్నారని, ప్రధాని ఫొటోనూ మార్ఫింగ్ చేశారని మూర్తి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం జ్యోతిషుడిపై కేసు నమోదుకు ఆదేశాలు జారీ చేసింది. వేణుస్వామి, మూర్తి మధ్య వివాదం నడుస్తోంది. మూర్తిపై వేణుస్వామి దంపతులు సంచలన ఆరోపణలు చేశారు. రూ.5 కోట్లు ఇవ్వాలని మూర్తి వేధిస్తున్నారని వేణుస్వామి దంపతులు ఆరోపించారు. 2017 నుంచి తమపై దుష్ప్రచారం చేస్తున్నారని వాపోయారు. అప్పట్లో మూర్తి అడిగిన డబ్బు ఇవ్వలేదన్నారు. 8 నెలలుగా మళ్లీ వేధింపులకు గురి చేస్తున్నారని, ఆత్మహత్య చేసుకునే పరిస్థితి కల్పించారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు వేణుస్వామి దంపతులు.