Telangana BJP : తెలంగాణపై అమిత్‌షా ఫోకస్.. అధికారమే లక్ష్యంగా 'మిషన్ తెలంగాణ'
Amit Shah : తెలంగాణపై బీజేపీ అగ్రనాయకత్వం పూర్తిగా దృష్టిపెట్టింది.;
Telangana BJP :తెలంగాణపై బీజేపీ అగ్రనాయకత్వం పూర్తిగా దృష్టిపెట్టింది. ఇప్పటికే జాతీయ కార్యవర్గ సమావేశాలు హైదరాబాద్‌లో నిర్వహించి సక్సెస్ చేసిన బీజేపీ.... మరింత దూకుడు పెంచింది. ఆ పార్టీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా.... త్వరలో తెలంగాణకు రానున్నారు.
అసెంబ్లీ ఎన్నికలు ముగిసే దాకా ప్రతి నెలా రెండ్రోజులు రాష్ట్రానికి కేటాయించనున్నారు. ఈ మేరకు షెడ్యూల్ సైతం వేసుకున్నట్లు చెబుతున్నారు బీజేపీ నేతలు. ఇందులో భాగంగా ఈ నెలాఖరులోగా అమిత్‌షా మరోసారి తెలంగాణకు వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదంటున్నాయి పార్టీ వర్గాలు.
తెలంగాణలో వచ్చే ఏడాదిన్నరలోగా ఎన్నికలుంటాయి. దీంతో ప్రధాని మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర మంత్రి అమిత్ షాలతో కూడిన అగ్రనాయకత్వం పూర్తిగా తెలంగాణ రాజకీయలపై ఇప్పటికే దృష్టి సారించింది. ఇందులో భాగంగానే హైదరాబాద్‌లో జరిగిన జాతీయ కార్యవర్గ భేటీలో మిషన్ తెలంగాణ' రోడ్‌మ్యాప్‌ను సిద్ధం చేసింది.
కేసీఆర్ సర్కారు వైఫల్యాలను ఎండగట్టాలని, నిరంతరం జనంలోనే ఉండాలని రాష్ట్రనేతలకు దిశానిర్దేశం చేసింది. క్షేత్రస్థాయిలో ఈ వ్యూహాన్ని పటిష్టంగా అమలు చేసే బాధ్యత అంతా అమిత్ షా తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.ఈ నేపథ్యంలో అమిత్ షా తెలంగాణ పర్యటనలకు ప్రాధాన్యత ఏర్పడింది.
ఆగస్టు 2 నుంచి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆధ్వర్యంలో మూడో విడత ప్రజాసంగ్రామ యాత్ర జరగనుంది. ఉమ్మడి నల్లగొండ, వరంగల్ జిల్లాల్లో 25 రోజులపాటు ఈ యాత్ర నిర్వహించనున్నారు. వరంగల్‌లో నిర్వహించే ఈ పాదయాత్ర ముగింపు బహిరంగ సభకు హోంమంత్రి అమిత్ షా ముఖ్యఅతిథిగా హాజరవుతున్నట్లు తెలుస్తోంది.
సంజయ్ పాదయాత్రతో పాటు రాష్ట్రం మొత్తం చుట్టివచ్చేలా బైక్ ర్యాలీలు చేపట్టాలంటూ గతంలోనే అమిత్‌షా ఆదేశించారు. అందుకు అనుగుణంగానే ముఖ్యనేతల బైక్ ర్యాలీలు ప్రారంభించింది రాష్ట్రనేతలు.
త్వరలోనే మరో 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ బైక్ ర్యాలీలు ప్రారంభం కానున్నాయి. ఈ ఏడాది చివర్లోగా ఐదారు విడతల్లో మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాలను చుట్టివచ్చేలా బైక్ ర్యాలీలను చేస్తారు. అగ్రనాయకత్వం ఆదేశాల మేరకు....నెలలో 20 రోజులు బండి సంజయ్ పాదయాత్ర, 10 రోజులు బైక్ ర్యాలీలు చేయనున్నారు.
మొత్తానికి... గ్రామస్థాయి వరకు పార్టీని బలోపేతం చేయడంతో పాటు టీఆర్‌ఎస్ వ్యతిరేక ప్రచారం, మోదీ సర్కార్ విజయాలు, జనంలోకి తీసుకెళ్లి.. సక్సెస్ సాధించే వ్యూహం...అమలు చేస్తున్నారు. అమిత్‌షా వ్యూహం ఎంతవరకు వర్కవుటవుతుందనేది చూడాలి.