Allu Arjun : సంధ్య థియేటర్ ఘటనకు హీరో అల్లు అర్జున్ దే బాధ్యతంటూ కొత్త ఆరోపణ
పుష్ప ప్రమోషన్ మోజులో మహిళ ప్రాణాలు పోయేందుకు పుష్ప-2 హీరో అల్లు అర్జున్, ప్రొడక్షన్ టీం, సంధ్య థియేటర్ యాజమాన్యం కారణమయ్యారని.. వారిపై చర్యలు తీసుకోవాలని జాతీయ మానవ హక్కుల కమిషనకు ఓ కంప్లయింట్ అందింది. శుక్రవారం ఢిల్లీలోని ఎన్హెస్ఆర్సీ ఆఫీసులో కంపైంట్ కాపీని అందజేసారు బీసీ పొలిటికల్ జేఏసీ చైర్మన్ యుగంధర్ గౌడ్. అనంతరం ఢిల్లీలోని తెలంగాణ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. సంధ్య థియేటర్లో పుష్ప-2 ప్రీమియర్ షో సందర్భంగా అల్లు అర్జున్ దుష్ప్రవర్తన, నిర్లక్ష్యం కారణంగా మానవ హక్కులను తీవ్ర భంగం వాటిల్లిందన్నారు. ప్రేక్షకులను కంట్రోల్ చేయలేమని పోలీసులు హెచ్చరించినా లెక్కలేనితనంతో నటుడు అల్లు అర్జున్ వచ్చారని, దానివల్ల ఓ మహిళ నిండు ప్రాణం బలైందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆమె కుమారుడు శ్రీతేజ చావు బతుకుల మధ్య ఉన్నాడని కమిషన్ దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు. ఈ సంఘటన రాజ్యాంగంలోని ఆర్టికల్ 21లోని జీవించే, వ్యక్తిగత స్వేచ్ఛను హరిం చిందన్నారు. అందువల్ల పుష్ప-2 హీరో, ప్రొడక్షన్ టీం, థియేటర్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని కమిషన్ ను కోరినట్లు తెలిపారు. బాధితులకు న్యాయం కల్పించేలా కమిషన్ తక్షణ జోక్యం అవసరమని పేర్కొన్నారు. సినిమాకు రూ. 13 వందల రేటును పెంచి జనాల పైన రుద్దారని విమర్శించారు. ఇకముందు ఎటువంటి సినిమాలకైనా ప్రీమియర్ షో అనుమతులు ఇవ్వకూడదని డిమాండ్ చేశారు.