ధరణి పెండింగ్ సమస్యలను ఆగస్టు 15లోగా పరిష్కరించాలనీ.. ఆ తర్వాత కొత్త చట్టం వస్తుందని సీఎం రేవంత్ రెడ్డి ( Revanth Reddy ) కలెక్టర్లకు సూచించారు. మార్చి 1నుంచి 15 వరకు స్పెషల్ డ్రైవ్ లో 1,61,760 దరఖాస్తులను పరిష్కరించినట్లు, కొత్తగా 1,15,308 దరఖాస్తులు వచ్చినట్లు జిల్లా కలెక్టర్లు సీఎంకు వివరించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ ధరణి దరఖాస్తులను తిరస్కరిస్తే అధికారులు కారణాన్ని తప్పకుండా నమోదు చేయాలన్నారు.
గడువు తర్వాత ఒక్క ధరణి పెండింగ్ ఉన్నా సహించేది లేదన్న సీఎం.. తహశీల్దార్లు, ఆర్డీవోల నిర్లక్ష్యం, నిర్లిప్తతపై కఠిన చర్యలు తీసుకుంటామనీ.. కొత్త చట్టం రూప కల్పన నేపథ్యంలో పాత పెండింగ్ దరఖాస్తులు ఒక్కటి కూడా ఉండొద్దని ఆదేశించారు. సచివాలయంలో మంగళవారం సీఎం రేవంత్ రెడ్డి కలెక్టర్లు, ఎస్పీలతో సమావేశమయ్యారు. కలెక్టర్ల సదస్సులో ఆయన అధికారులకు దిశానిర్దేశం చేశారు.
మ్యుటేషన్లు ఎందుకు పెండింగ్ లో ఉన్నాయని నిలదీశారు సీఎం. తహశీల్దార్ల వద్దే 1.48లక్షల పెండింగ్స్ పేరుకుపోవడం, ఆర్డీవోల వద్ద 50వేలు, అదనపు కలెక్టర్ల వద్ద 23వేల పెండింగ్ దరఖాస్తులు, 12 వేలు కలెక్టర్ల లాగిన్ లో ఎందుకు పెండింగ్ పెట్టారని సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు.