ఘట్‌కేసర్ ఫార్మసీ అమ్మాయి సూసైడ్ కేసులో ట్విస్ట్..!
ఘట్‌కేసర్ ఫార్మసీ అమ్మాయి సూసైడ్ కేసులో కొత్త విషయాలు కూడా బయటకు వస్తున్నాయి. నిన్న మధ్యాహ్నం కూడా ఆమె ఆత్మహత్యాయత్నం చేసిందని కుటుంబసభ్యులు చెప్తున్నారు.;
ఘట్‌కేసర్ ఫార్మసీ అమ్మాయి సూసైడ్ కేసులో కొత్త విషయాలు కూడా బయటకు వస్తున్నాయి. నిన్న మధ్యాహ్నం కూడా ఆమె ఆత్మహత్యాయత్నం చేసిందని కుటుంబసభ్యులు చెప్తున్నారు. వెంటనే గుర్తించి ఘట్‌కేసర్ ఆస్పత్రికి.. తర్వాత గాంధీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించామంటున్నారు. డాక్టర్లు డిశ్చార్జ్ చేయడంతో రాత్రికి ఇంటికి వచ్చామని వివరిస్తున్నారు.
ఐతే.. రాత్రి కుటుంబ సభ్యులు నిద్రపోయాక మళ్లీ ఆత్మహత్యాయత్నం చేసిందా అమ్మాయి. తండ్రి వాడే షుగర్ మాత్రలు పెద్ద మోతాదులో మింగడంతో ఆపస్మారక స్థితికి చేరుకుంది. ఉదయం ఇది గుర్తించి ఆస్పత్రికి తీసుకువెళ్లినా అప్పటికే ఆలస్యమైపోయింది. వైద్యులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఫార్మసీ విద్యార్థిని ప్రాణాలు కోల్పోయింది.
కిడ్నాప్ వ్యవహారం తర్వాత కాలేజ్ మానేసి ఇంట్లోనే ఉంటున్న ఆమె.. ఇటీవలి పరిణామాలతో డిప్రషన్‌లోకి వెళ్లిపోయిందని భావిస్తున్నారు. తీవ్రమైన మానసిక ఒత్తిడి కారణంగానే సూసైడ్ చేసుకున్నట్టు చెప్తున్నారు. ఆత్మహత్య చేసుకున్న యువతి డెడ్‌బాడీ ప్రస్తుతం గాంధీ ఆస్పత్రికి చేరింది. అక్కడ పోస్ట్ మార్టం తర్వాత బంధువులకు అప్పగిస్తారు.
మరోవైపు.. బీఫార్మసీ విద్యార్థిని ఆత్మహత్య ఘటనపై హైకోర్టు న్యాయవాది అరుణ్ కుమార్ హెచ్చార్సీలో ఫిర్యాదు చేశారు. విద్యార్థిని కిడ్నాప్ ఘటన సందర్భంగా.. పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించి ప్రెస్ మీట్ పెట్టడంతో విద్యార్థిని మానసికంగా కుంగిపోయిందని పేర్కొన్నారు.
పోలీసుల తొందరపాటు చర్యల వల్ల విద్యార్థిని జీవించే హక్కు కోల్పోయిందని ఆరోపించారు. ఘటనకు బాధ్యులైన పోలీసులపై చర్యలు తీసుకుని.. విద్యార్థిని కుటుంబానికి ఆర్థిక సాయం అందించాలని న్యాయవాది కమిషన్‌ను కోరారు.