REVANTH: ఎవరు అడ్డుపడ్డా మూసీ ప్రక్షాళన చేసి తీరుతాం
శాసనసభలో ముఖ్యమంత్రి రేవంత్ స్పష్టీకరణ.. ప్రక్షాళనా చేయాలా వద్దా..? అంటూ సూటి ప్రశ్న.. మొదట 21 కిలోమీటర్లు ప్రక్షాళన చేస్తామని వెల్లడి
ఎవరు అడ్డుపడ్డా ఎట్టి పరిస్థితుల్లో మూసీ ప్రక్షాళన చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.మూసీ ప్రక్షాళనపై అసెంబ్లీలో మాట్లాడిన రేవంత్.. 2026 మార్చిలో మూసీ ఫస్ట్ ఫేజ్ పనులను ప్రారంభిస్తామని చెప్పారు. గండిపేట్ నుంచి బాపూ ఘాట్ వరకు మొదట 21 కి.మీ మూసీ ప్రక్షాళన చేస్తామని చెప్పారు.సంక్రాంతి లోగా ఫస్ట్ ఫేజ్ డీపీఆర్ పై క్లారిటీ వస్తుందన్నారు. ఈ పనులకు ఏడీబీ బ్యాంకు రూ.4 వేల కోట్ల రుణం ఇచ్చేందుకు అంగీకరించిందని తెలిపారు. గతంలో జలవనరులను కాపాడుకొనే ప్రయత్నాలు జరగలేదని విమర్శించారు. మూసీ నది ప్రక్షాళనపై తెలంగాణ అసెంబ్లీలో వాడీ వేడీగా చర్చ జరిగింది. ఈ విషయంపై మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి.. గుజరాత్ సబర్మతి, గంగా, యమునా నదుల ప్రాజెక్టులను ఉదాహరిస్తూ.. మూసీ పునరుద్ధరణ ఆవశ్యకత గురించి చెప్పారు. అందులో భాగంగా తొలి దశలో మార్చి 31 లోగా.. 21 కిలో మీటర్ల మేర మూసీ ప్రక్షాళన పనులు మొదలుపెట్టనున్నట్లు తెలిపారు. అదే విధంగా 51 కి.మీ. ఎలివేటెడ్ కారిడార్లు కూడా నిర్మిస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. సంక్రాంతిలోగా డీపీఆర్‌పై స్పష్టత వస్తుందని చెప్పారు. గండిపేట, హిమాయత్‌సాగర్ నుంచి గాంధీ సరోవర్ వరకు తొలి దశ మూసీ నది అభివృద్ధి చేస్తామని చెప్పారు. 2026 మార్చి 31 కల్లా తొలి దశ పనులు ప్రారంభిస్తామని సీఎం వెల్లడించారు. కాగా, సంక్రాంతిలోగా మొదటి దశ మూసీ పునరుద్ధరణ ప్రాజెక్టు డీపీఆర్‌పై.. స్పష్టత ఇస్తామన్నారు. కాగా, నాబార్డ్ నుంచి తీసుకున్న రూ.4,100 కోట్లతో ఈ పనులు చేపట్టనున్నట్లు తెలుస్తోంది.
గాంధీ సరోవర్ ప్రాజెక్టు..
తెలంగాణలో మూసీ నది 240 కిలోమీటర్లు ప్రవహిస్తుందని చెప్పారు సీఎం రేవంత్. అనంతగిరి హిల్స్ నుంచి వాడపల్లి వరకు మూసీ ప్రవాహం ఉందని.. అందుకే మూసీ, ఈసీ నదులు కలిసే ప్రదేశంలో బాపుఘాట్ నిర్మిస్తామని ప్రకటించారు. అక్కడ గాంధీ సరోవర్ ప్రాజెక్ట్ చేపట్టాని వెల్లడించారు. ఈ సందర్భంగా నదీ పరివాహక ప్రాంతంలోనే అభివృద్ధి జరుగుతుందని సీఎం నొక్కి చెప్పారు. ఇక జలవనరులను కలుషితం చేసి, కబ్జాలు చేసి ఫాంహౌస్‌లు నిర్మించారని.. వాటి డ్రైనేజీలను జంట జలాశయాలకు కలిపారని ప్రతిపక్షాలపై రేవంత్ మండిపడ్డారు. అందుకే ఆ డ్రైనేజీలను కూలగొట్టి, కబ్జాలపై చర్యలు తీసుకున్నామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. " మూసీ వల్ల నల్గొండ జిల్లా ప్రజలు శిక్ష అనుభవిస్తున్నారు.ఫ్లోరైడ్ పాపానికి తోడు, మూసీ వల్ల నల్గొండ ప్రజలు చేతులు,కాళ్లు, నడుము వంకరతో నరకయాతన అనుభవిస్తున్నారు.. సిటీలోని మూసీ మురుగుతో నల్గొండ ప్రజలు ఇబ్బందిపడుతున్నారు.. ఎట్టి పరిస్థితుల్లోనూ మూసీ ప్రక్షాళన చేసి తీరుతాం. ఢిల్లీలో యమునా నది అభివృద్ధి చేస్తామని బీజేపీ హామీ ఇచ్చింది. మేం ఏ అభివృద్ధి చర్యలను వ్యతిరేకించడం లేదు.నిర్వాసితులకు మెరుగైన వసతులు, సౌకర్యాలు కల్పిస్తున్నాం. మూసీ అభివృద్ధి జరిగింది అంటే నిజాం కాలంలోనే . ’ అని రేవంత్ తెలిపారు.
బీఆర్ఎస్ సంచలన నిర్ణయం
అసెంబ్లీ శీతాకాల సమావేశాలను బాయికాట్ చేయాలని బీఆర్ఎస్ నిర్ణయించింది. ఈ మేరకు మాజీ మంత్రి హరీష్ రావు ప్రకటించారు. గన్‌పార్క్ వద్ద మీడియాతో మాట్లాడుతూ.. అసెంబ్లీ శీతాకాల సమావేశాలను బహిష్కరించాలని బీఆర్ఎస్ నిర్ణయం తీసుకుందన్నారు. స్పీకర్, ప్రభుత్వ వైఖరికి నిరసనగా అసెంబ్లీ సమావేశాలను బాయ్ కాట్ చేస్తున్నామని మాజీ మంత్రి స్పష్టం చేశారు. అసెంబ్లీ తీరు చూస్తుంటే శాసనసభ నిబంధనలకు విరుద్ధంగా ఉందని మండిపడ్డారు. బీఏసీ మీటింగ్‌కు ప్రభుత్వం తరపున గంటన్నర లేటుగా వచ్చారని.. అసెంబ్లీలో ప్రతిపక్ష సభ్యులకు మాట్లాడే అవకాశం ఇవ్వలేదని విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీని బూతులమయం చేశారని మండిపడ్డారు. అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష పార్టీకి మైక్ ఇవ్వరా అని ప్రశ్నించారు. పార్లమెంటులో నరేంద్ర మోదీని రాహుల్ గాంధీ తిట్టడంలేదా అని నిలదీశారు.