NEW YEAR: సంబరాల మధ్య.. కోటి ఆశలతో కొత్త ఏడాదిలోకి..
నూతన ఏడాదికి ఘనంగా స్వాగతం పలికిన తెలుగు రాష్ట్రాలు
తెలుగు రాష్ట్రాల్లో నూతన సంవత్సరం వేడుకలు అత్యంత ఘనంగా జరిగాయి. 2026 సంవత్సరానికి స్వాగతం పలుకుతూ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల వ్యాప్తంగా ప్రజలు ఆనందోత్సాహాలతో సంబరాలు చేసుకున్నారు. ప్రధాన నగరాలతో పాటు పట్టణాలు, గ్రామాల్లోనూ నూతన సంవత్సర వేడుకలు ఉత్సాహంగా కొనసాగాయి. యువత, కుటుంబాలు, స్నేహితులు కలిసి అర్ధరాత్రి 12 గంటలకు కౌంట్‌డౌన్ చేస్తూ కొత్త ఏడాదికి స్వాగతం పలికారు. హైదరాబాద్లో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి. ట్యాంక్‌బండ్, నెక్లెస్ రోడ్, దుర్గం చెరువు, హైటెక్ సిటీ, గచ్చిబౌలి ప్రాంతాలు అర్ధరాత్రి వరకు ప్రజలతో కిటకిటలాడాయి. ఆకాశంలో రంగురంగుల బాణాసంచా వెలుగులు నగరాన్ని మరింత ఆకర్షణీయంగా మార్చాయి. యువత పెద్ద సంఖ్యలో రోడ్లపైకి వచ్చి నృత్యాలు చేస్తూ, పాటలు పాడుతూ కొత్త సంవత్సరాన్ని స్వాగతించారు. పబ్‌లు, హోటళ్లు, క్లబ్బులు ప్రత్యేక డీజే షోలు, లైవ్ మ్యూజిక్‌తో సందడిగా మారాయి.
వేడుకల్లో పాల్గొన్న రేవంత్
తెలుగు రాష్ట్రాల్లో కొత్త సంవత్సర వేడుకలు అంబరాన్నంటాయి. టపాసుల మోతలు, కేక్ కటింగ్‌లు, డీజే శబ్దాల మధ్య ‘హ్యాపీ న్యూ ఇయర్’ అంటూ ప్రజలు 2026కి ఘన స్వాగతం పలికారు. నగరాలు, పట్టణాలు మొదలుకొని గ్రామాల్లోని ప్రజలు వీధుల్లోకి వచ్చి వేడుకల్లో పాల్గొన్నారు. కొత్త ఏడాదికి స్వాగతమంటూ సంబరాలు చేసుకున్నారు. బేగంపేటలోని ఐఏఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్ క్లబ్లో నూతన సంవత్సర వేడుకలు నిర్వహించారు. ముఖ్య అతిథిగా సీఎం రేవంత్‌రెడ్డి హాజరై శుభాకాంక్షలు తెలిపారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, పలువురు సీనియర్ ఐఏఎస్ అధికారులు, అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. రాయదుర్గం మై హోం భూజాలో నూతన సంవత్సర వేడుకలు నిర్వహించారు. కార్యక్రమంలో సినీనటుడు మనోజ్ పాల్గొని సందడి చేశారు. ప్రజలకు ఆయన శుభాకాంక్షలు చెప్పారు. సినిమా డైలాగ్‌లు చెప్పి, డ్యాన్స్ చేసి యువతలో జోష్ నింపారు.
హైదరాబాద్ సీపీ సజ్జనార్ నగర వాసులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. నేరాల నియంత్రణలో గతేడాది ప్రజల నుంచి మంచి సహకారం ఉందని పేర్కొన్నారు. ఈ ఏడాది కూడా ఉండాలని ఆకాంక్షించారు. ప్రజల కోసమే పోలీసులు పనిచేస్తున్నారని.. తాము ఎల్లవేళలా అందుబాటులో ఉంటామని వివరించారు. నూతన సంవత్సరంలో అందరికీ ఆయురారోగ్యాలు ఉండాలని ఆకాంక్షించారు. సచివాలయం సమీపంలో న్యూఇయర్ వేడుకలు చేసుకుంటున్న వారికి సజ్జనార్ శుభాకాంక్షలు తెలిపారు. నూతన సంవత్సర వేడుకల వేళ కొంతమంది నగరవాసులు మద్యం తాగి వాహనాలు నడుపుతూ పోలీసులకు పట్టుబడ్డారు. తార్నాక, హబ్సిగూడ, నాచారం, మల్లాపూర్, మియాపూర్, చందానగర్, నాంపల్లి, కూకట్పల్లి తదితర ప్రాంతాల్లో పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించారు.
ఆంధ్రప్రదేశ్ లోనూ....
ఆంధ్రప్రదేశ్‌లో కూడా నూతన సంవత్సరం వేడుకలు ఘనంగా జరిగాయి. విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, గుంటూరు, నెల్లూరు వంటి నగరాల్లో హోటళ్లు, రిసార్టులు, ఫంక్షన్ హాళ్లలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. విజయవాడలో కృష్ణా నది పరివాహక ప్రాంతాలు, ప్రధాన రహదారులు రాత్రివరకు సందడిగా మారాయి. యువత బైక్ ర్యాలీలు, సంగీత కార్యక్రమాలతో కొత్త సంవత్సరాన్ని ఆనందంగా ప్రారంభించారు. విశాఖపట్నంలో ఆర్కే బీచ్, కైలాసగిరి ప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో ప్రజలు చేరారు. సముద్ర తీరంలో బాణాసంచా, సంగీత కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. కుటుంబ సమేతంగా వచ్చిన ప్రజలు ఫొటోలు తీసుకుంటూ, ఒకరికొకరు శుభాకాంక్షలు చెప్పుకున్నారు. దేవాలయాల్లో ప్రత్యేక పూజలు, ప్రార్థనలు నిర్వహించి, కొత్త సంవత్సరం శుభాలు కలగాలని భక్తులు ప్రార్థించారు.