హైదరాబాద్‌లో రెచ్చిపోతున్న వీధి కుక్కలు... తొమ్మిదేళ్ల బాలుడు మృతి
హైదరాబాద్‌లో వీధి శునకాలు రెచ్చిపోతున్నాయి. వెర్రెక్కి చిన్నారుల ప్రాణాలను బలిగొంటున్నాయి. తాజాగా కిషన్‌బాగ్ అసద్ బాబానగర్‌లో ఓ బాలుడిపై వీధి కుక్కలు విరుచుకుపడ్డాయి.;
హైదరాబాద్‌లో వీధి శునకాలు రెచ్చిపోతున్నాయి. వెర్రెక్కి చిన్నారుల ప్రాణాలను బలిగొంటున్నాయి. తాజాగా కిషన్‌బాగ్ అసద్ బాబానగర్‌లో ఓ బాలుడిపై వీధి కుక్కలు విరుచుకుపడ్డాయి. ఇంటి దగ్గర ఆడుకుంటున్న తొమ్మిదేళ్ల బాలుడిపై అతి కౄరత్వంతో దాడి చేశాయి. ఈ దుర్ఘటనలో బాలుడు అయాన్ అక్కడిక్కడే ప్రాణాలు వదిలాడు. మరో బాలుడికి గాయాలయ్యాయి. ఈ ఘటనతో ఆ ఇంట విషాదచాయలు అలుముకున్నాయి.
నిన్న సాయంత్రం బాలుడు అయాన్ ఇంటికి కొద్ది దూరంలో ఉన్న ఖాళీ స్థలంలో మరో బాలుడితో కలిసి ఆడుకోవడానికి వెళ్లాడు. అయితే ఒక్కసారిగా అయాన్‌పై కుక్కలు దాడి చేశాయి. అడవి మృగాల రీతిలో అతి కౄరంగా, తల, వీపుపై దాడి చేశాయి. తీవ్రగాయాలపాలైన అయాన్.. అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. విషయం తెలుసుకున్న బహదూర్‌పురా పోలీసులు, విటర్నరీ విభాగం అధికారులు పరిస్థితి సమీక్షించారు.
కుషాయి గూడలో మరో ఘటన చేసుకుంది. శివసాయి నగర్‌లో బిస్కెట్ ప్యాకెట్ కోసం కిరాణా షాప్‌నకు వెళ్లిన చిన్నారి మోక్షపై వీధి కుక్క దాడి చేసింది. వీపు, చేతులను కరిచి గాయాలు చేసింది. అయితే అక్కడివారంతా అప్రమత్తం కావడంతో చిన్నారి మోక్ష ప్రాణాలతో బయటపడింది. చిన్నారిని జమ్మిగడ్డలోని ప్రభుత్వాస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. ఈ వరుస ఘటనలతో భాగ్యనగర వాసులు బెంబేలెత్తిపోతున్నారు. తమ పిల్లలను ఇంటి నుంచి బయటకు తీసుకెళ్లాలంటేనే భయపడిపోతున్నారు.
హైదరాబాద్‌లో ఏకంగా 10 లక్షల వీధి కుక్కలు ఉన్నట్లుగా అంచనా. నగరంలో ఏ రోడ్డు చూసినా.... వీధి కుక్కలే దర్శనమిస్తున్నాయి. కుక్కల దాడి ఘటనలు తరచూ జరుగుతున్నా. జీహెచ్‌ఎంసీ అధికారుల్లో మాత్రం నిర్లక్ష్య ధోరణి స్పష్టంగా కనిపిస్తోంది. కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నారు తప్ప శునకాల నివారణలో విఫలమయ్యారని కొందరు ఆరోపిస్తున్నారు.
గత ఐదేళ్లలో కుక్కల నియంత్రణ కోసం ఏకంగా 45 కోట్లు ఖర్చు చేశామని జీహెచ్‌ఎంసీ అధికారులు చెబుతున్నారు. ఇక కుక్కల దాడిలో గాయపడినవారికి వైద్యం చేయిద్దామంటే కొన్ని ఆస్పత్రుల్లో యాంటీ రేబిస్ టీకా కూడా అందుబాటులో లేనిదుస్థితి. కనీసం కుక్కల కుటుంబ నియంత్రణకు చర్యలు తీసుకోవడం లేదనే ఆరోపణలు వెల్లువెత్తున్నాయి.