GADKARI: తెలంగాణ రూపురేఖలు మారుస్తాం: గడ్కరీ
తెలంగాణ సహకరిస్తే అద్భుతాలు చేస్తామన్న కేంద్ర మంత్రి;
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు ప్రత్యేక చరిత్ర ఉందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్‌లో జాతీయ రహదారులను ఆయన ప్రారంభించారు. రూ.3,900 కోట్ల విలువైన పనులను ప్రారంభించారు. కేంద్ర ప్రభుత్వం పీఎం సడక్ యోజన కింద దేశవ్యాప్తంగా రోడ్లు నిర్మిస్తోందని చెప్పారు. రహదారులు మెరుగ్గా ఉండే దేశాన్నే అభివృద్ధి చెందిన దేశంగా భావిస్తారని పేర్కొన్నారు. వ్యవసాయం, ఉపాధి, రవాణా, మౌలిక వసతులు అనే 4 అంశాలు దేశాభివృద్ధిని నిర్దేశిస్తాయన్నారు.
అభివృద్ధి పనులు ఆరంభం
రూ.3,099 కోట్లతో నిర్మించిన మంచిర్యాల-వాంకిడి జాతీయ రహదారి-363ని గడ్కరీ ప్రారంభించారు. మరో రూ.3 వేల కోట్లతో చేపట్టిన వివిధ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. హైదరాబాద్‌లోని బీహెచ్‌ఈఎల్ చౌరస్తాలో రూ.138 కోట్లతో, అంబర్‌పేటలో రూ.145 కోట్లతో నిర్మించిన ఫ్లైఓవర్లను కూడా ఆరంభించారు. తెలంగాణలోని ఏ పట్టణం నుంచైనా ఐదు గంటల్లో హైదరాబాద్‌కు వచ్చేలా జాతీయ రహదారుల వ్యవస్థను అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు.
తెలంగాణ అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం
తెలంగాణ అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందని తెలిపారు. రాబోయే మూడు, నాలుగేళ్లలో తెలంగాణ రాష్ట్రంలో సుమారు రూ. 2 లక్షల కోట్ల విలువైన జాతీయ రహదారుల ప్రాజెక్టులను చేపట్టనున్నట్లు గడ్కరీ ప్రకటించారు. ఈ ప్రాజెక్టులతో తెలంగాణ రూపురేఖలు సంపూర్ణంగా మారిపోతాయని ధీమా వ్యక్తం చేశారు. 'అమెరికా ధనిక దేశం కాబట్టి రోడ్లు బాగున్నాయనేది సరికాదు. రోడ్లు బాగున్నందునే అమెరికా ధనిక దేశం. రోడ్లు బాగున్న దేశాన్నే అభివృద్ధి చెందిన దేశంగా ప్రజలు భావిస్తారు.' అని గడ్కరీ చెప్పుకొచ్చారు. అనంతరం అంబర్‌పేట్ ఫ్లైఓవర్‌ను గడ్కరీ, కిషన్ రెడ్డి ప్రారంభించారు. ఫ్లైఓవర్ నాలుగు లేన్లతో 1.7 కిలోమీటర్ల దూరంతో నిర్మించారు. దీని నిర్మాణానికి దాదాపు రూ.335 కోట్లు ఖర్చు చేశారు.