కొత్త రేషన్ కార్డులకు అప్లికేషన్లు స్వీకరిస్తుండటంతో మీసేవ కేంద్రాలకు ప్రజలు పోటెత్తుతున్నారు. సోమవారం నుంచి బుధవారం వరకు 2.6 లక్షల దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. నిన్న ఒక్కరోజే లక్షకుపైగా అప్లికేషన్లు వచ్చాయన్నారు. అటు రద్దీపై స్పందించిన పౌరసరఫరాల శాఖ మీసేవల్లో రేషన్ కార్డుల దరఖాస్తుల ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని వెల్లడించింది. అప్లికేషన్ కోసం తొందరపడొద్దని సూచించింది.
రేషన్ కార్డు దరఖాస్తులపై పౌరసరఫరాల శాఖ కీలక సూచనలు చేసింది. దరఖాస్తు రసీదును ఎక్కడా ఇవ్వాల్సిన అవసరం లేదని, వారి వద్దే భద్రపరుచుకోవాలని చెప్పింది. అప్లికేషన్ల స్వీకరణ నిరంతర ప్రక్రియ అని, నిర్దిష్ట గడువు ఏమి లేదని పేర్కొంది. కాగా కొన్ని చోట్ల రేషన్ కార్డు దరఖాస్తులకు భారీగా వసూలు చేస్తున్నారని పలువురు ఆరోపించిన సంగతి తెలిసిందే.
రేషన్ కార్డు దరఖాస్తు కోసం మీ-సేవ నిర్వాహకులు రూ.50 మాత్రమే తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. కొన్ని చోట్ల ఎక్కువ డబ్బులు తీసుకుంటున్నారని ఫిర్యాదులు రావడంతో ఆయా సెంటర్ల నిర్వాహకులకు నోటీసులు ఇచ్చినట్లు అధికారులు తెలిపారు. విచారణ జరిపి వారి లైసెన్సులు రద్దు చేస్తామన్నారు. ఎవరైనా ఎక్కువ డబ్బులు తీసుకుంటే మీ-సేవ హెల్ప్ లైన్ నంబర్ 1100కు కాల్ చేసి ఫిర్యాదు చేయాలని సూచించారు.