Congress Leader Sunitha Rao : మహిళా కాంగ్రెస్ నేత సునీత రావుకు నోటీసులు

Update: 2025-05-22 07:30 GMT

టీపీసీసీ చీఫ్ బి మహేష్ కుమార్ గౌడ్ ఛాంబర్ ముందు ఆయనకు వ్యతిరేకంగా ధర్నా చేయడమే గాక, పార్టీ నియమ నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరించారన్న ఆరోపణలపై మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు సునీతారావు మొగిలికి అఖిలభారత మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు అల్కాలాంబ షోకాజ్ నోటీసు జారీ చేశారు. ఈ నెల 14న పార్టీ కార్యాలయంలో టీపీసీసీ చీఫ్ కు వ్యతిరేకంగా ధర్నా చేయడం పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించడమేనని, అది మీ స్థాయికి తగదని, పార్టీలో పలు స్థాయిల్లో ఉన్న వారు తమ అభిప్రాయాలను సంబంధిత వేదికలపై, గౌరవప్రదంగా తెలియజేయాల్సి ఉంటుందని, అందుకు మీరు వ్యవహరించిన తీరు పూర్తిగా పార్టీ క్రమశిక్షణకు వ్యతిరేకంగా ఉందని నోటీసులో అల్కాలాంబ పేర్కొన్నారు. సునీతారావు పార్టీక్రమశిక్షణకు వ్యతిరేకించడంతో పాటు సంస్థకు నష్టం కలిగించే విధంగా వ్యవహరించారని ఆరోపించారు.

నోటీసులు అందిన 7 రోజుల్లో లిఖిల పూర్వక సమాధానం పంపాలని లేకపోతే క్రమశిక్షణ చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని అల్కాలాంబ హెచ్చరించారు. నామినేటెడ్ పదవులతో పాటు పార్టీపదవులను మహిళా కాంగ్రెస్ నేతలకు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 14న సునీతారావుతో పాటు పెద్ద సంఖ్యలో మహిళా నేతలు గాంధీభవన్లో ధర్నా చేసి సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా మహేష్ కుమార్ గౌడ్తో పాటు సీఎం రేవంత్ రెడ్డిపై కూడా ఆరోపణలు గుప్పించారు. గడచిన కొన్ని రోజులుగా నామినేటెడ్ పోస్టులతో పాటు పార్టీ పదవుల్లో తమకు ప్రాధాన్యత కల్పించాలని సునీతారావు చేస్తున్న ఆందోళనలు పార్టీలో హాట్ టాపిక్ గా మారాయి.

Tags:    

Similar News