స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తుండటంతో తెలంగాణ బీజేపీ రాష్ట్ర నూతన అధ్యక్షుడి నియామక ప్రక్రియను త్వరగా తేల్చే యాలన్న భావనతో ఆ పార్టీ హైకమాండ్ ఉంది. ఈ మేరకు తెలంగాణ బీజేపీ కొత్త రథసారథి ఎంపిక ప్రక్రియ విషయంలో స్పీడ్ పెంచింది. ఇందుకోసం అధ్యక్ష పదవి రేసులో ఉన్న నేతల్లో ఎవరికి పగ్గాలు అప్పగించాలో పేర్కొంటూ ముగ్గురి పేర్లతో రూపొందించిన జాబితాను పార్టీ రాష్ట్ర నాయకత్వం నుంచి తెప్పించుకున్నట్లు తెలిసింది.
ఈ నేపథ్యంలో తెలంగాణ బీజేపీ రథసారథి ఎంపికపై నెలకొన్న సందిగ్ధానికి త్వరలో తెరపడనుంది. కొద్దిరోజుల్లోనే తెలంగాణ బీజేపీ నూతన రథసారథి ప్రకటన వెలువడనుందని పార్టీలో ముఖ్యనేతలు చర్చించుకుంటున్నారు. అయితే రాష్ట్ర రథసారథి ఎంపిక ప్రక్రియ తుది దశకు చేరుకోవడంతో ఆశావహుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. అదే సమయంలో పార్టీ కొత్త అధ్యక్షుడిగా ఎవరికి అవకాశం దక్కుతోందనన్న ఉత్కంఠం పార్టీ శ్రేణుల్లో నెలకొంది. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసి మెరుగైన ఫలితాలు సాధిస్తేనే రానున్న 2028 అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో పార్టీ అధికారంలోకి రాగలుగుతుందని కమలనాథులు భావిస్తున్నారు. ఇటీవల జరిగిన రాష్ట్ర కార్యవర్గ సమావేశాల్లోనూ కార్యకర్తలను స్థానిక ప్రజా ప్రతినిధులుగా గెలిపించుకుంటా మని బీజేపీ ఎంపీలు శపథం చేశారు.
ఈ నేపథ్యంలో ఆ లక్ష్యం నెరవేరాలంటే పార్టీకి సమర్థుడైన రథసారథి కావాలన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. కాగా.. బీజేపీ ఎంపీలు ఈటల రాజేందర్, ధర్మపురి ఆర్వింద్, డీకే అరుణతో పాటు ఎమ్మెల్యే పాయల్ శంకర్, మాజీ ఎమ్మెల్సీ రామచందర్ రావు, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు, తల్లోజు ఆచారి బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి రేసులో ఉన్నారు. వీరిలో ఎవరిని పార్టీ నూతన రథసారథిగా అధిష్టానం ఎంపిక చేస్తుందోనన్నది ఉత్కంఠగా మారింది.