చేనేత కార్మికుల సమగ్రాభివృద్ధి కోసం తమ ప్రభుత్వం పని చేస్తుందన్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా సోషల్ మీడియా వేదికగా నేత కార్మికులకు శుభాకాంక్షలు తెలియజేశారు. భారతదేశ సాంస్కృతిక వారసత్వానికి చేనేత ప్రతీక అన్నారు. మానవ నాగరికత ప్రగతిలో చేనేతకు విశిష్టమైన స్థానం ఉందని.. నేత కార్మికుల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని తెలిపారు. చేనేత కార్మికుల పాత బకాయిలు విడుదల చేయడంతో పాటు, రూ.లక్ష వరకు ఉన్న రుణాలు మాఫీ చేశామని గుర్తు చేశారు. అభయ హస్తం పథకం, తెలంగాణ నేతన్న పొదుపు, నేతన్న బీమా, తెలంగాణ నేతన్నకు భరోసా వంటి వినూత్న కార్యక్రమాలు ప్రజాప్రభుత్వం అమలు చేస్తోందని సీఎం రేవంత్ రెడి పేర్కొన్నారు.