Vanajeevi Ramayya : పద్మశ్రీ వనజీవి రామయ్య కన్నుమూత.. ప్రముఖుల స్పందన ఇదే
పద్మశ్రీ పురస్కార గ్రహీత, ప్రకృతి ప్రేమికుడు వనజీవి రామయ్య ఈ తెల్లవారుజామున గుండెపోటుతో మృతి చెందారు. ఆయన వయసు 85 సంవత్సరాలు. జీవితమంతా మొక్కలు నాటి పెంచిన ఆయన ఇంటి పేరే వనజీవి అయింది. రామయ్య స్వగ్రామం ఖమ్మం జిల్లాలోని రెడ్డిపల్లి. కోటికిపైగా మొక్కలు నాటిన రామయ్య సరికొత్త రికార్డు సృష్టించారు. 2017లో రామయ్యను భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంతో గౌరవించింది. పద్మశ్రీ వనజీవి రామయ్య ఇక లేరనే వార్త విని తీవ్ర విచారానికి లోనయ్యానని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. పర్యావరణ పరిరక్షణ విషయంలో ఆయన చేసిన కృషి అసామాన్యమని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. పర్యావరణ పరిరక్షణకు వనజీవి రామయ్య ఒక్కరే కోటి మొక్కలు నాటడం స్ఫూర్తిదాయకమని నేతలు అన్నారు. మొక్కలు నాటుతూ అడవులను సృష్టించిన రామయ్య సేవలు అమోఘమని కొనియాడారు. ఆయన లేని లోటు పూడ్చలేనిదని విచారం వ్యక్తం చేశారు. నేటి తరానికి రామయ్య ఆదర్శప్రాయుడని ప్రధానమంత్రి నరేంద్రమోడీ అన్నారు. రామయ్య ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. వనజీవి రామయ్య కుటుంబానికి ప్రముఖులు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.