MGM Hospital : వరంగల్ ఎంజీఎం హాస్పిటల్‌లో దారుణం.. రోగి కాలు, వేళ్లు కొరికిన ఎలుకలు
MGM Hospital : అది ఉత్తర తెలంగాణలోనే పెద్దాసుపత్రి. అలాంటి హాస్పిటల్‌కు వెళ్తే ప్రాణాలు నిలుపుకోవచ్చనుకున్నారు.;
MGM Hospital : అది ఉత్తర తెలంగాణలోనే పెద్దాసుపత్రి. అలాంటి హాస్పిటల్‌కు వెళ్తే ప్రాణాలు నిలుపుకోవచ్చనుకున్నారు. కానీ అక్కడికి వెళ్లిన తర్వాత పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. ప్రాణాలు కాపాడుకుందామని వస్తే ఎలుకలు, సిబ్బంది నిర్లక్ష్యం వల్ల ఓ రోగి పరిస్థితి మరింత విషమంగా మారింది.
వరంగల్ సిటీ భీమారానికి చెందిన శ్రీనివాస్ కిడ్ని సంబంధిత వ్యాధితో ఈ నెల 26న చికిత్స కోసం ఎంజీఎంలో అడ్మిట్ అయ్యాడు. 27వ తేదీ ఉదయం లేచి చూసే సరికి శ్రీనివాస్ కాలు వేలును ఎలుక కొరికేసింది. గమనించిన శ్రీనివాస్ బంధువులు వైద్యులకు సమాచారం ఇవ్వడంతో చికిత్స అందించారు.
మళ్లీ గురువారం ఉదయం సుమారు మరోసారి శ్రీనివాస్ కాళ్లను ఎలుకలు కొరికేశాయి. దీంతో తీవ్రంగా రక్తస్రావమైంది. అప్పటికే ప్రాణాపాయ స్థితిలో ఉన్న శ్రీనివాస్...ఎలుకల దాడి కారణంగా మరింత అనారోగ్యానికి గురయ్యారు. ఎంజీఎం హాస్పిటల్ సిబ్బంది నిర్లక్ష్యంపై శ్రీనివాస్ కుటుంబసభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఐసీయూలోనే పరిస్థితి ఇలా ఉంటే ఎలా అని ప్రశ్నిస్తున్నారు.ఘటనపై స్పందించారు ఎంజీఎం హాస్పిటల్ సూపరిండెంట్ శ్రీనివాస రావు. బాధ్యులపై తగిన చర్యలు తీసుకుంటామన్నారు. రోగుల బంధువులు బయటి నుంచి ఆహారం తీసుకొచ్చి పడేయడం వల్లే ఎలుకల బెడద ఎక్కువైందన్నారు.
శానిటేషన్ కాంట్రాక్టర్‌కు నోటీసులు జారీ చేశామన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామన్నారు.