AMIT SHAH: కలిసి నడవండి: అమిత్‌ షా

కిషన్‌రెడ్డి, పవన్‌కల్యాణ్‌కు సూచన... 33 సీట్లు అడుగుతున్న జనసేన!

Update: 2023-10-26 02:15 GMT

తెలంగాణలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పనిచేయాలని కిషన్‌రెడ్డి, పవన్‌ కల్యాణ్‌కు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా సూచించారు. భాజపా తెలంగాణ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌లతో కేంద్ర హోంమంత్రి అమిత్‌షా చర్చలు జరిపారు. తెలంగాణలో కలిసి పని చేయడంపై ఇప్పటికే ప్రాథమిక అవగాహనకు వచ్చిన ఇరు పార్టీల నేతలు అమిత్‌షాను కలిసి సుమారు 40 నిమిషాలపాటు చర్చించారు. తాను శుక్రవారం హైదరాబాద్‌కు వస్తున్నానని, ఆలోపు సీట్ల సర్దుబాటుపై ఒక అవగాహనకు రావాలని వారికి అమిత్‌షా సూచించినట్లు తెలిసింది. అందుకు కిషన్‌రెడ్డి, పవన్‌కల్యాణ్‌ అంగీకరించారు. అంతర్గతంగా పార్టీల్లో చర్చించుకొని ఎవరెక్కడ పోటీ చేయాలనుకుంటున్నదీ చెబుతామని వారు చెప్పారు.

జనసేన నాయకులు ఉమ్మడి హైదరాబాద్, మహబూబ్‌నగర్, ఖమ్మం, నల్గొండ, మెదక్‌ జిల్లాల్లో 33 సీట్లు అడుగుతున్నట్లు తెలిసింది. ఈ సమావేశంలో అమిత్‌ షా, పవన్‌కల్యాణ్‌లు ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల గురించి కూడా మాట్లాడుకున్నట్లు తెలిసింది. ఏపీలో నెలకొన్న ఇబ్బందికర పరిస్థితుల గురించి హోంమంత్రికి పవన్‌ కల్యాణ్‌ వివరించగా.. ఆంధ్రప్రదేశ్‌కు అన్ని రకాలుగా అనుకూలంగా ఉంటామని, రాష్ట్ర అభివృద్ధికి తప్పకుండా సహకరిస్తామని, కష్టపడి పనిచేయాలని ఆయన సూచించినట్లు సమాచారం. ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశంతో జనసేన కలిసివెళ్తున్న విషయం అమిత్‌షా వద్ద చర్చకు రాలేదని, తెలంగాణలో కలిసి పనిచేసే విషయం మాత్రమే చర్చకు వచ్చినట్లు తెలిసింది.

Tags:    

Similar News