బీఆర్ఎస్ అధినేత, సిద్ధిపేట జిల్లా గజ్వేల్ ఎమ్మెల్యే కేసీఆర్ శాసనసభ సమావేశాలకు హాజరుకాకపోవడంపై విజయ్పీల్ రెడ్డి అనే వ్యక్తి తెలంగాణ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ పిటిషన్ ను న్యాయస్థానం స్వీకరించగా దీనిపై హైకోర్టు మంగళవారం విచారణ జరిపింది. ఇందులో పలు అంశాలు విచారణకు వచ్చాయి. ప్రతిపక్ష నేతగా కేసీఆర్ తన బాధ్యత మరిచారంటూ న్యాయవాది వాదనలు వినిపించారు. ప్రతిపక్ష నేతగా ఉన్న కేసీఆర్ అసెంబ్లీలో ప్రజల సమస్యలను లేవనెత్తాల్సిన బాధ్యతను కలిగి ఉన్నారని పిటిషనర్ తరపు న్యాయవాది వివరించారు. కొన్ని నెలలుగా కేసీఆర్ అసెంబ్లీకి రావడం లేదని, అసెంబ్లీ సమావేశాలకు హాజరుకాకుంటే చట్టప్రకారం అనర్హుడిగా ప్రకటిం చొచ్చని న్యాయవాది న్యాయస్థానానికి వివరించారు.
ఈ మేరకు అసెంబ్లీ కార్యదర్శికి ఆదేశాలు జారీ చేయాలని కోరారు. న్యాయవాది వాదనలు విన్న కోర్టు.. ఈ వ్యాజ్యంలో జోక్యం చేసుకోవడానికి కోర్టు పరిధి ఏంటని ధర్మాసనం ప్రశ్నించింది. ఈ వ్యవహారంలో పిలు అర్హత లేదని శాసనసభ వ్యవహారాల తరపు న్యాయవాది తెలిపారు. ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవచ్చని, ఈ మేరకు వాదనలు వినిపించడానికి గడువు కావాలని పిటిషనర్ న్యాయవాది కోరారు. దీంతో ఈ వ్యాజ్యంపై విచారణకు న్యాయస్థానం రెండు వారాలకు వాయిదా వేసింది.