PM Modi : నేడు హైదరాబాద్‌కు ప్రధాని మోదీ..!
PM Modi : ముచ్చింతల్ దివ్వసాకేతానికి ప్రధాని మోదీ ఇవాళ రానున్నారు. సమతామూర్తి విగ్రహాన్ని లోకార్పణం చేస్తారు.;
PM Modi : ముచ్చింతల్ దివ్వసాకేతానికి ప్రధాని మోదీ ఇవాళ రానున్నారు. సమతామూర్తి విగ్రహాన్ని లోకార్పణం చేస్తారు. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో మధ్యాహ్నం 2గంటల 10 నిమిషాలకు శంషాబాద్ చేరుకుంటారు. ఇక్రిసాట్‌లో జరిగే కార్యక్రమంలో పాల్గొని సాయంత్రం 5గంటలకు ముచ్చింతల్‌లోని శ్రీరామనగరానికి ప్రత్యేక హెలికాప్టర్‌లో వస్తారు. హెలిపాడ్ సమీపంలోని అతిథి గృహాంలో 10 నిమిషాలపాటు సేదతీరిన తర్వాత.. అక్కడి నుంచి నేరుగా యాగశాలకు వెళ్తారు. యాగశాలలో సాయంత్రం 6 గంటలకు పెరుమాళ్లను దర్శించుకుని.. విశ్వక్‌సేనుడి పూజను నిర్వహిస్తారు. అనంతరం సమతామూర్తి కేంద్రానికి చేరుకుంటారు మోదీ.
సమతామూర్తి కేంద్రంలో.. 108 దివ్యదేశాలతోపాటు భద్రవేది మొదటి అంతస్తులోని స్వర్ణమయ సమతామూర్తి విగ్రహాన్ని దర్శించుకుంటారు ప్రధాని మోదీ. అనంతరం భద్రవేది మూడో అంతస్తులో 216 అడుగుల రూపంలో కొలువుదీరిన సమతామూర్తి విగ్రహానికి.. శ్రీత్రిదండి చిన్నజీయర్‌స్వామితో కలిసి పూజలు నిర్వహిస్తారు. పూజల అనంతరం రాత్రి 7గంటలకు.. సమతామూర్తి విగ్రహాన్ని జాతికి అంకితం చేస్తారు. అనంతరం అక్కడే సుమారు అరంగంటపాటు ప్రసంగిస్తారు. ఆ తర్వాత రామానుజచార్యుల విగ్రహంపై 15నిమిషాలపాటు జరిగే 3డీ షోను వీక్షిస్తారు. అక్కడి నుంచి మరోసారి యాగశాలకు చేరుకుని.. శ్రీలక్ష్మీనారాయణ యాగానికి పూర్ణాహుతి పలుకుతారు. ఈ సందర్బంగా 5వేల మంది రుత్వికులు ప్రధాని మోదీకి వేద ఆశీర్వాదం ఇస్తారు.
ప్రధాని పర్యటన నేపథ్యంలో శంషాబాద్ ముచ్చింతల్ దివ్య సాకేతం వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. ప్రధాని పర్యటించే సమతామూర్తి ప్రాంగణాన్ని SPG తన ఆధీనంలోకి తీసుకుంది. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ గగనతలం నుంచి సమతామూర్తి ప్రాంగణంలోని హెలిపాడ్ వరకు.. SPG రిహార్సల్స్ నిర్వహించింది. డాగ్ స్క్వాడ్, బాంబ్ స్క్వాడ్ బృందాలు సాకేతం ప్రాంగణాన్ని జల్లెడ పట్టాయి. కేంద్ర, రాష్ట్ర బలగాలు.. పటిష్ఠమైన రక్షణ వలయాన్ని ఏర్పాటు చేశాయి. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో.. సీఎం కేసీఆర్ స్థానంలో.. మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్.. ప్రధానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున స్వాగతం పలుకుతారు. వీడ్కోలు కార్యక్రమాన్ని కూడా ఆయనే పర్యవేక్షిస్తారు.