HCU: ఆగని నిరసనలు.. హెచ్‌సీయూ వద్ద ఉద్రిక్తత

ప్రొఫెస‌ర్లు, విద్యార్థుల‌పై లాఠీఛార్జ్‌.. ?;

Update: 2025-04-02 07:00 GMT

కంచ గచ్చిబౌలి భూవివాదం నేపథ్యంలో హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీలో విద్యార్థులు, అధ్యాపకుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. యూనివర్సిటీ గేట్‌ లోపలే ఉండి వారు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం చదును చేస్తున్న 400 ఎకరాల భూమి వైపు వెళ్లేందుకు యత్నించిన ఆందోళనకారులను పోలీసులు అడ్డుకున్నారు. ఒకదశలో పోలీసులు లాఠీ ఝళిపించారు. విద్యార్థులు నిరసనను ఉద్ధృతం చేస్తున్న తరుణంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

కంచ గచ్చిబౌలి భూముల వివాదం నేపథ్యంలో హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ (హెచ్‌సీయూ) వద్ద విద్యార్థులు ఆందోళ‌న చేస్తున్న విష‌యం తెలిసిందే. రేవంత్ రెడ్డి ప్ర‌భుత్వంపై హెచ్‌సీయూ విద్యార్థులు పోరుబాట కొన‌సాగిస్తున్నారు. జీవ వైవిధ్యాన్ని కాపాడాలంటూ వారు నిర‌స‌న‌లు తెలుపుతున్నారు.

అయితే, బుధ‌వారం ఉద‌యం హెచ్‌సీయూ క్యాంప‌స్‌ను వేలాది మంది పోలీసులు చుట్టుముట్టారు. క్యాంపస్ చుట్టూ బారికేడ్లు ఏర్పాటు చేసి, వ‌ర్సిటీ లోప‌లికి బ‌య‌టి వ్యక్తుల‌ను రానివ్వ‌కుండా చేయడంతో పాటు విద్యార్థుల‌ను బ‌య‌ట‌కు పోనివ్వ‌కుండా పోలీసులు అడ్డుకున్నారు.

దీంతో కాంగ్రెస్ ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా క్యాంప‌స్‌లో విద్యార్థులు, ప్రొఫెసర్లు నిర‌స‌నకు దిగారు. ఈ క్ర‌మంలో పోలీసులు నిర‌స‌న తెలుపుతున్న ప్రొఫెస‌ర్లు, విద్యార్థుల‌పై లాఠీఛార్జ్ చేశారు. దాంతో పోలీసుల తీరుపై ప్రొఫెస‌ర్లు, విద్యార్థులు తీవ్ర స్థాయిలో మండిప‌డ్డారు. కాంగ్రెస్ ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా నిన‌దిస్తూ, పోలీస్ జులుం న‌శించాల‌ని నినాదాలు చేశారు. దీంతో హెచ్‌సీయూ క్యాంప‌స్‌లో తీవ్ర‌ ఉద్రిక్తత నెలకొంది. 

Tags:    

Similar News