MMTS Case: ఎంఎంటీఎస్ రైలు అత్యాచారం.. అంతా ఉత్తిదే అంట!

250 కెమెరాలు.... 100 మంది అనుమానితులు... రీల్స్ చేస్తూ పొరపాటున జారి పడినట్టు వెల్లడి...;

Update: 2025-04-19 03:00 GMT

కొద్దిరోజుల క్రితం సికింద్రాబాద్‌ ఎంఎంటీఎస్‌ రైల్లో యువతిపై అత్యాచారయత్నం వ్యవహారం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఈ కేసుపై పోలీసులు దర్యాప్తు చేయగా కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ట్రైన్‌లో అత్యాచారయత్నం అనేది కట్టుకథ అని.. ప్రమాదవశాత్తు ట్రైన్ నుంచి కిందపడిన యువతి పోలీసులను తప్పు దోవ పట్టించేందుకు ఈ కథ అల్లిందని పోలీసులు వెల్లడించారు.

అసలేం జరిగిందంటే...

అనంతపురం జిల్లాకు చెందిన యువతి హైదరాబాద్‌లో ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తుంది. మార్చి 22వ తేదీన ఫోను రిపేరు కోసం మెదక్‌ నుంచి సికింద్రాబాద్‌కు వచ్చిన ఆ యువతి.. ఫోన్‌ రిపేరు అనంతరం ఎంఎంటీఎస్‌ రైల్లో తిరిగి వెళ్తోంది. ఈ క్రమంలో తనతోపాటు ఆ బోగీలో ఉన్న మరో ఇద్దరు మహిళలు ఇతర స్టేషన్లలో దిగిపోగా.. ఆ యువతి ఒంటరిగా ఉంది.

ఈ సమయంలో అదే ట్రైన్‌లో ప్రయాణిస్తున్న ఓ యువకుడు.. ఈమె వద్దకు వచ్చి అత్యాచారయత్నానికి ప్రయత్నించాడు. దీంతో ఆ యువకుడి నుంచి తప్పించుకునే ప్రయత్నంలో రైల్లో నుంచి దూకేసింది. ఇది ఆ యువతి చెప్పిన కథ.

వెలుగులోకి నిజాలు

కొంపల్లి సమీపంలో రైలు బ్రిడ్జి వద్ద కిందపడి గాయపడిన యువతిని స్థానికులు గమినించి ప్రశ్నించగా ఇదే విషయాన్ని చెప్పింది. వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులకు ఇదే విషయాన్ని చెప్పటంతో... కేసు నమోదు చేసిన పోలీసుల విచారణ ప్రారంభించారు. దర్యాప్తులో భాగంగా 250 సీసీ కెమెరాలను జల్లెడ పట్టి.... 100 మంది అనుమానితులను విచారించారు. అయినా వారికి ఎటువంటి ఆధారం దొరకలేకపోవటంతో పోలీసులకు అనుమానం వచ్చింది. దీంతో ఆ యువతిని కాస్త గట్టిగా ప్రశ్నించగా.. ఇన్‌స్టా రీల్స్‌ చేస్తూ పొరపాటున జారిపడ్డానని అసలు విషయం ఒప్పుకుంది. యువతి సమాధానంతో షాక్‌కు గురైన పోలీసులు మరోసారి ఇలాంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

Tags:    

Similar News