ప్రముఖ యాంకర్ సుమ కనకాల భర్త, నటుడు రాజీవ్ కనకాల భూ వివాదంలో చిక్కుకున్నారు. హైదరాబాద్ శివారు లోని ఓ ప్లాట్ విక్రయాల పై ఆయనకు రాచకొండ పోలీసులు నోటీసులు ఇచ్చారు. కాగా ఇదే వ్యవహారం లో సినీ నిర్మాత విజయ్ చౌదరిపై కూడా హయత్‌నగర్ పీఎస్‌లో కేసు నమోదైంది.
వివరాల ప్రకారం.. హైదరాబాద్ శివారు పెద్ద అంబర్‌పేట మున్సిపాలిటీ, పసుమాముల రెవెన్యూ పరిధిలోని సర్వే నెం. 421 వెంచర్‌లో రాజీవ్ కనకాలకు ఓ ఫ్లాట్ ఉంది. ఈ ఫ్లాట్‌ను ఆయన కొన్ని నెలల క్రితం నిర్మాత విజయ్ చౌదరికి విక్రయించారు. అధికారిక రిజిస్ట్రేషన్ కూడా జరిగినట్లు తెలుస్తోంది.
అయితే, విజయ్ చౌదరి అదే ఫ్లాట్‌ను ఎల్బీనగర్‌కు చెందిన శ్రవణ్ రెడ్డి అనే వ్యక్తికి రూ. 70 లక్షలకు విక్రయించారు. కానీ, అపుడే అసలు సమస్య మొదలైంది. ఇటీవల శ్రవణ్ రెడ్డి తన ఫ్లాట్‌ను పరిశీలించేందుకు వెళ్లగా..ప్లాట్ కనిపించకపోవడం తో ఆయన ఖంగు తిన్నారు. నకిలీ స్థలాన్ని అమ్మి తనను మోసం చేశారనే అనుమానంతో విజయ్ చౌదరిని సంప్రదించారు. ఐతే విజయ్ చౌదరి దీని గురించి కూర్చొని మాట్లాడుకుందామని చెప్పి తప్పించుకున్నాడని శ్రవణ్ రెడ్డి ఆరోపిస్తున్నారు. తాను గట్టిగా నిలదీయడం తో తనను బెదిరిస్తున్నారని శ్రవణ్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు విజయ్ చౌదరిపై కేసు నమోదు చేశారు. కేసు దర్యాప్తులో భాగంగా విజయ్ చౌదరి కి ప్లాట్ ను విక్రయించిన రాజీవ్ కనకాల పాత్రను పరిశీలించేందుకు ఆయనకు నోటీసులు జారీ చేశారు పోలీసులు. ఈ ఫ్లాట్ లావాదేవీలో రాజీవ్ పాత్రపై స్పష్టత రావాల్సి ఉంది.