ఉత్తర తెలంగాణ వర ప్రదాయిని కాళేశ్వరం ప్రాజెక్టుపై ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని మాజీ బీఆర్ఎస్ ఎంపీ వినోద్ కుమార్ మండిపడ్డారు. ఏదైనా మాట్లాడే ముందు అవగాహనతో మాట్లాడాలని సూచించారు. కాళేశ్వరం అంటే మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ బ్యారేజీలే అన్న అవగాహనతోనే కాంగ్రెస్ నాయకులు ఉన్నారని పొన్నం ప్రభాకర్ మాటల్లో తెలుస్తున్నదని పేర్కొన్నారు. సోమవారం ఆయన కరీంనగర్ మీడియాతో మాట్లాడారు. ఇంతకంటే అవగాహనారాహిత్యం మరొకటి ఉండదు. కాళేశ్వరంలో నిర్మించిన వందలాది కాంపోనెంట్స్‌లో ఈ మూడు బ్యారేజీలు కూడా ఉన్నాయి తప్ప అవే కాళేశ్వరం ప్రాజెక్టు కాదు. కాళేశ్వరం స్వరూపాన్ని పొన్నం ప్రభాకర్‌కు, అతని సహచరులకు మరొక్కసారి వివరించాల్సిన అవసరం ఉన్నదని వినోద్ కుమార్ తెలిపారు. బ్యారేజీలు, జలాశయాలు, గ్రావిటి కాలువలు, పైప్ లైన్లు, సొరంగాలు, భూగర్భ పంప్ హౌజ్ లు, సర్జ్ పూల్స్, విద్యుత్ సబ్ స్టేషన్లు, విద్యుత్ లైన్లు.. ఇవన్నీ కలిపితే ఒక ప్రాజెక్టు తయారవుతుందని వినోద్ కుమార్ స్పష్టం చేశారు.