KTR: తెలంగాణలో మరో 700 కోట్ల పెట్టుబడి.. మూడు వేల మందికి ఉద్యోగాలు..
KTR: ప్రీమియర్ ఎనర్జీస్ గ్రూపు హైదరాబాద్‌లోని తమ ప్లాంటును మరింత విస్తరించనుంది.;
KTR: సోలార్ సెల్స్, మాడ్యూల్స్‌ను తయారు చేస్తున్న ప్రీమియర్ ఎనర్జీస్ గ్రూపు హైదరాబాద్‌లోని తమ ప్లాంటును మరింత విస్తరించనుంది. ఇందుకోసం అమెరికన్ సంస్థ అజ్యూర్ పవర్ గ్లోబల్ లిమిటెడ్‌తో వ్యూహాత్మక భాగస్వామ్య ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ప్రగతిభవన్‌లో ప్రీమియర్ ఎనర్జీస్ కంపెనీ ప్రతినిధులతో సమావేశమై మంత్రి కేటీఆర్.. ఈ-సిటీలో నూతన ప్లాంట్ల ఏర్పాటుకు అవసరమైన అనుమతి పత్రాలను అందజేశారు. తెలంగాణలో ప్రీమియర్ ఎనర్జీస్, అజ్యూర్ పునరావృత పెట్టుబడి పెట్టడాన్ని ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్ అభినందించారు.
రాష్ట్రంలో అమలవుతున్న స్నేహపూర్వక పారిశ్రామిక విధానాలకు ఈ పెట్టుబడే నిదర్శనమని పేర్కొన్నారు. మెగా ప్రాజెక్ట్స్‌లో భాగంగా ప్రీమియర్ ఎనర్జీస్ విస్తరణ ప్రణాళిక అమలు కోసం ఈ-సిటీలో అదనంగా 20 ఎకరాల భూమిని కేటాయించినట్టు చెప్పారు. ఈ-సిటీలో ఈ కంపెనీ అత్యాధునిక కేంద్రాన్ని ఏర్పాటు చేయడం తెలంగాణకు గర్వకారణమన్నారు. దీని ద్వారా సదరు కంపెనీలు మరింత భారీస్థాయికి ఎదుగుతాయన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.