Komuravelli Jatara : కొమురవెల్లి జాతరలో మౌలిక వసతులు లేక భక్తుల ఇబ్బందులు

Update: 2023-12-31 05:32 GMT

తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు నిలువుటద్దం కొమురవెల్లి మల్లన్న స్వామి జాతర. నిత్యం వేలాది మంది భక్తులు స్వామివారి దర్శనానికి వస్తుంటారు. స్వామివారి బ్రహోత్సవాలకైతే రాష్ట్ర నలుమూలల నుంచి పోటెత్తుతారు. ఆలయానికి ఏటా కోట్లాది రూపాయల ఆదాయం వస్తున్నా అభివృద్ది మాత్రం జరగడం లేదు. మౌలిక వసతుల్లేక భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 

సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లన్న ఎంతో మంది భక్తులకు ఇంటి ఇలవేల్పు. మల్లిఖార్జున స్వామి క్షేత్రంలో సంక్రాంతి తర్వాత వచ్చే ఆదివారంతో జాతర మొదలవుతుంది. ఉగాదికి ముందు వచ్చే ఆదివారం వరకు మూడు నెలలుపాటు వరకు కొనసాగుతుంది. మల్లన్న జాతరకు భక్తులు భారీగా తరలివస్తారు. ఆలయానికి కోట్ల ఆదాయం వస్తున్నా... మౌలిక వసతులు మాత్రం అంతంత మాత్రంగానే ఉన్నాయి. మార్గశిర మాసం చివరి ఆదివారమైన జనవరి 7న స్వామివారి కళ్యాణం జరగనుంది. వారం కళ్యాణం ఉన్నా... అధికారులు తాత్కాలిక ఏర్పాట్లు కూడా చేయలేని దుస్థితి నెలకొంది. 

మల్లన్న దర్శనం కోసం వచ్చే భక్తులు... దేవాలయ ప్రాగణంలోనే రాత్రి బస చేస్తారు. ఉదయం స్వామివారిని దర్శించుకుంటారు. మంచి నీళ్లు, మరుగుదొడ్లు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 12 కోట్ల రూపాయలతో క్యూ కాంప్లెక్స్ నిర్మాణ పనులకు నిధులు మంజూరు చేశారు. నాలుగు నెలల కిందట పనులు ప్రారంభించారు. పనులు నత్త నడకన సాగుతున్నాయి. గుట్టపైకి వెళ్లడానికి లిఫ్ట్‌ లేకపోవడంతో.. దివ్యాంగులు నానా అవస్థలు పడాల్సి వస్తోంది.

ప్రత్యేక దర్శనాలు, ప్రసాద విక్రయాల దగ్గర సిబ్బంది అవినీతికి పాల్పడుతూ.. ఆలయ ఆదాయానికి గండి కొడుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. అక్రమాలకు అడ్డుకట్ట వేయాలనే ఉద్దేశంతో 2018లోనే అప్పటి మంత్రి హరీష్ రావు ఆన్‌లైన్‌ సేవలు ప్రారంభించాలని ఆదేశించారు. ఇంతవరకు ఆ నిర్ణయం అమల్లోకి రాలేదు. కోనేరు నిర్వహణ సరిగా లేక ఆరుబయటే భక్తులు స్నానాలు చేస్తున్నారు. మహిళలు దుస్తులు మార్చుకోవడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.  అధికారులు, పాలకమండలి ఇప్పటికే అలసత్వాన్ని వీడి భక్తులకు ఇబ్బందుల్లేకుండా ఏర్పాట్లు చేయాలని భక్తులు కోరుకుంటున్నారు.

Tags:    

Similar News