ప్రజలందరి భాగస్వామ్యంతోనే చెరువులకు పునరుజ్జీవనం కల్పిస్తామని హైడ్రా కమిషనర్ ఏ.వి.రంగనాథ్ అన్నారు. గురువారం హైదరాబాద్‌లో హైడ్రా కార్యాలయంలో లేక్ మ్యాన్ ఆఫ్ ఇండియా ఆనంద్ మల్లిగవాడ్‌తో హైడ్రా కమిషనర్ శ్రీ ఏవీ రంగనాథ్ వీడియో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చెరువుల పరిరక్షణ బాధ్యత ప్రతి ఒక్కరిదని ఆయన స్పష్టం చేశారు. పరిసర ప్రాంతాల్లో నివసిస్తున్న కాలనీ, బస్తీ వాసులు, స్వచ్ఛంద, కార్పొరేట్ సంస్థలు, ప్రభుత్వ విభాగాలను భాగస్వామ్యం చేసి చెరువులను పునరుద్ధరించనున్నామన్నారు. పర్యావరణానికి చెరువలే ఆదరువు అని స్పష్టం చేశారు. పర్యావరణ పరిరక్షణకు చెరువు తల్లి లాంటిదని ఆయన అభివర్ణించారు. తాగు, సాగు నీరందించే చెరువులు పట్టణీకరణతో ప్రభావాన్ని కోల్పోయాయన్నారు. చాలా చెరువులు కనుమరుగైతే.. ఉన్నవి కొన్ని మురికి కూపాలుగా మారాయని చెప్పారు. ప్రస్తుతం ఆ చెరువులకు పునరుజ్జీవనం ఇచ్చేందుకు హైడ్రా చర్యలు తీసుకుంటోందని ఏ.వి.రంగనాథ్ వెల్లడించారు.