Telangana News : ఘనంగా ప్రజాపాలన దినోత్సవం.. అసెంబ్లీలో జెండా ఎగురవేసిన స్పీకర్
తెలంగాణ విమోచన దినోత్సవాన్ని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ప్రజా పాలన దినోత్సవం గా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. నిజాం నిరంకుశ పాలన నుంచి విముక్తి పొంది, హైదరాబాద్ సంస్థానం భారత దేశంలో విలీనమైన ఈరోజున తెలంగాణ వ్యాప్తంగా సంబరాలు జరుగుతున్నాయి. ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా తెలంగాణ అసెంబ్లీ, శాసనమండలిలో ఘనంగా వేడుకలు జరిగాయి.
ఈ మేరకు అసెంబ్లీ ప్రాంగణంలోని గాంధీ విగ్రహం వద్ద స్పీకర్ గడ్డం ప్రసాద్, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ నివాళులు అర్పించారు. అనంతరం స్పీకర్ గడ్డం ప్రసాద్ జాతీయ జెండాను ఎగురవేసి, తెలంగాణ ప్రజలకు ప్రజా పాలన దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.మరోవైపు, శాసనమండలిలో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ జాతీయ జెండాను ఆవిష్కరించి, రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు.
అలాగే తెలంగాణ కాంగ్రెస్ తన అధికారిక ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసింది. "రాచరిక పాలన నుంచి విముక్తి పొంది తెలంగాణలో ప్రజాస్వామ్య పాలన ఆరంభమైన రోజు నేడు. సువిశాల భారతావనిలో తెలంగాణ అంతర్భాగమైన రోజును పురస్కరించుకొని రాష్ట్ర ప్రజలందరికీ తెలంగాణ ప్రజాపాలన దినోత్సవ శుభాకాంక్షలు" అని పోస్ట్ లో పేర్కొంది.