Rachakonda SHE Teams : పోకిరీలకు కఠిన శిక్షలు... రాచకొండ షీ టీమ్స్ స్ట్రాంగ్ వార్నింగ్
హైదరాబాద్ లోని పోకిరీలకు రాచకొండ షీటీమ్ గట్టి వార్నింగ్ ఇచ్చింది. బాలికలను, మహిళలను వేధిస్తే వారికి కఠిన శిక్షలు తప్పవని హెచ్చరించింది. ఇందులో భాగంగా బుధవారం రాచకొండ క్యాంపు కార్యాలయంలో 203 మంది ఆకతాయిలకు కౌన్సిలింగ్ నిర్వహించారు. వీరిలో మేజర్స్ 138 మంది ఉండగా, మైనర్లు 65 మంది ఉన్నారు. ఈ సందర్భంగా రాచకొండ సీపీ సుధీర్ బాబు మాట్లాడారు. ఈవ్ టీజింగ్ చేసేవారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. ఎటువంటి భయాందోళన లేకుండా పోలీసు స్టేషన్లలో ఫిర్యాదు చేయాలని సూచించారు. అనంతరం ఉమెన్ సేఫ్టీ వింగ్ డీసీపీ టీ.ఉషారాణి మాట్లాడుతూ మార్చి 1 నుండి 31 వరకు నమోదైన వేధింపు కేసుల వివరాలను వెల్లండించారు. ఫోన్ ద్వారా 30 కేసులు, సోషల్ మీడియా యాప్స్ ద్వారా 87 కేసులు, నేరుగా బాధితులను వేధించిన కేసులు 132 ఉన్నాయని పేర్కొన్నారు. ఫిర్యాదుల ద్వారా 294 కేసులు నమోదయ్యాయని తెలిపారు. కాగా వీటిలో 14 క్రిమినల్ కేసులు 84పెట్టీ కేసు ఉన్నాయని తెలిపారు. 116 మందికి కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగిందని అన్నారు. జనసమ్మర్థంగా ఉండే ప్రాంతాలలో షీటీమ్స్ నిఘాను పెంచనున్నట్టు తెలిపింది.