Rahul Gandhi: వరంగల్‌లో రాహుల్ గాంధీ భారీ బహిరంగ సభ.. చరిత్రలో నిలిచిపోయేలా ప్లాన్..
Rahul Gandhi: తెలంగాణ రాష్ట్రంలో తిరిగి అధికారంలోకి వచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ విశ్వప్రయత్నాలు చేస్తోంది.;
Rahul Gandhi (tv5news.in)
Rahul Gandhi: తెలంగాణ రాష్ట్రంలో తిరిగి అధికారంలోకి వచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ విశ్వప్రయత్నాలు చేస్తోంది. స్థానిక నాయకులతో ఢిల్లీలో సమావేశమైన రాహుల్... వచ్చే నెల 6, 7 తేదీల్లో తెలంగాణ పర్యటనకు వస్తున్నారు. రైతు సమస్యలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న వైఖరిని.. వరంగల్ రైతు సంఘర్షణ సభ ద్వారా ఎండగట్టేందుకు ప్రణాళికలు సిద్దం చేస్తున్నారు.
ఇప్పటికే వరంగల్‌లో పర్యటించిన రేవంత్ రెడ్డి, ఇతర ముఖ్య నాయకులు.. స్థానిక నేతలతో సమావేశమై సభ నిర్వహణపై సమీక్షించారు. ఆ తర్వాత హైదరాబాద్ గాంధీభవన్‌లో ఏర్పాటు చేసిన పీసీసీ విస్తృత స్థాయి సమావేశంలో కూడా రాహుల్ గాంధీ పర్యటనను ఏవిధంగా విజయవంతం చేయాలన్న దానిపైనే సుదీర్ఘంగా చర్చించారు.
నేతల నుంచి వచ్చిన సలహాలు, సూచనలను క్రోడీకరించుకుని ముందుకు వెళ్లేందుకు టీపీసీసీ సమాయత్తం అవుతోంది. ఇప్పటికే రాహుల్ పర్యటనను దృష్టిలో ఉంచుకుని ప్రోటోకాల్ కమిటీ, కోఆర్డినేషన్ కమిటీ, రిసెప్షన్‌కమిటీ, పబ్లిక్ మీటింగ్ మానిటరింగ్- స్టేజి ఏర్పాట్ల కమిటీ, జనసమీకరణ కమిటీ, జిల్లాల వారీగా ఇంఛార్జీలను సైతం పీసీసీ నియమించింది. ఈ కమిటీలలో సీనియర్లందరినీ రేవంత్ భాగస్వామ్యం చేశారు.
జనసమీకరణను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రణాళికాబద్దంగా తరలింపు ఉండేట్లు రూట్‌మ్యాప్ సిద్దం చేశారు. వరంగల్‌కు సమీపంలోని నియోజక వర్గాలు, మండలాలు, ఏడు పార్లమెంటు నియోజక వర్గాల నుంచి భారీగా జనసమీకరణ ఉండాలని నాయకులకు స్పష్టం చేశారు. దూరం నుంచి వచ్చే వారి సంఖ్య తక్కువగా ఉన్నా.. అనుకున్న సంఖ్యలో సభకు జనం తరలి వస్తారని అంచనా వేస్తున్నారు.
నాయకులను, పార్టీ శ్రేణులను సమాయత్తం చేసేందుకు 25న కరీంనగర్, 26న ఖమ్మం, 27న నల్గొండ జిల్లాల్లో కాంగ్రెస్ నాయకులతో రేవంత్ సమీక్ష నిర్వహిస్తారు. రాహుల్ గాంధీ సభ ద్వారా సమగ్ర వ్యవసాయ పాలసీ ప్రకటించేందుకు ఇప్పటినుంచే కసరత్తు చేస్తున్నారు రేవంత్ రెడ్డి. వరంగల్ సభలో రాహుల్ ఏమేమి మాట్లాడాలి, ఏయే అంశాలు పొందుపరచాలన్న దానిపై కిసాన్ కాంగ్రెస్ నాయకులతోపాటు రైతు సమస్యలపై అవగాహన కలిగిన నేతలను భాగస్వామ్యం చేస్తున్నారు.
మరో వైపు తెలంగాణలోని 42వేల పోలింగ్ బూత్‌ల నుంచి ప్రతి ఎన్‌రోలర్ తనతో కలిపి పది మందిని సభకు తీసుకొచ్చేట్లు చూడాలని ఇప్పటికీ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ నెల 29వ తేదీ తరువాత.. ఎస్పీజీ విభాగం అధికారులు ముందస్తుగా రాష్ట్రానికి వచ్చి పర్యటించిన తరువాత.. రాహుల్ పర్యటనకు చెందిన కార్యక్రమంలో మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉందని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
అగ్రనేత రాహుల్ వరంగల్ సభ ద్వారా కాంగ్రెస్ శ్రేణుల్లో జోష్ నింపనుంది. ఇన్నాళ్లు నిస్తేజంగా ఉన్న నేతలు, కార్యకర్తలు.. మరింత జోష్‌తో ఎన్నికలకు సమాయత్తం అయ్యేలా వరంగల్ సభ నిర్వహణ ఉండేలా ప్లాన్ చేస్తున్నారు.