నగరంలో కురుస్తున్న వర్షం.. చలికి వణికిపోతున్న జనం
గ్రేటర్ హైదరాబాద్‌లో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది.;
ఎండలతో చెమటలు కక్కుతున్న వేళ.. గ్రేటర్ హైదరాబాద్‌లో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం పడుతోంది. సూరారం, బహదూర్‌పల్లి, జీడిమెట్ల, బాలానగర్, చింతల్.. ఫతేనగర్, కొంపల్లి, బోయిన్‌పల్లిలో భారీ వర్షం కురుస్తోంది. విదర్భ ప్రాంతంలో ఉపరితల ఆవర్తనం, ఉపరితల ద్రోణి ప్రభావంతో పలు ప్రాంతాల్లో వాన పడుతున్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
గురువారం రాత్రి కూడా నగరంలో పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. శుక్రవారం ఉదయం నుంచి ఆకాశంలో మబ్బులు కమ్ముకున్నాయి. గత కొద్ది రోజులుగా చలి తీవ్రత పెరిగింది. ఇప్పుడు కురుస్తున్న అకాల వర్షం కారణంగా చలి గాలులు వీస్తున్నాయి. దీంతో చలి తీవ్రత మరింత పెరిగింది. నగర వాసులు చలికి వణికి పోతున్నారు.