RAIN: చినుకు పడితే వణుకుతున్న హైదరాబాద్
భారీ వర్షం కురిస్తే మునిగిపోతున్న నగరం.. ప్రతీ వర్షానికి మునిగిపోతున్న చాలా ప్రాంతాలు... గంటల తరబడి బారులు తీరుతున్న వాహనాలు..
వర్షం కురిస్తే నీట మునిగిన కాలనీలు, వరద నీటిలో కొట్టుకుపోయి ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలు, జలమయమైన అనేక ప్రాంతాలు, కట్టలు తెగి మురికి నీరుతో పొంగి ప్రవహిస్తున్న చెరువులు.... ఇదీ హైదరాబాద్లో ప్రస్తుత పరిస్థితి. రెండు రోజులు వర్షం పడితే చాలు భాగ్య నగరం మునిగిపోతోంది. వర్షాల వల్ల ఇంకా మరణాలు సంభవిస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. హైదరాబాద్లో వర్షం పడిందంటే చాలు రోడ్లు, కాలనీలు చెరువులను తలపిస్తాయి. నగరంలో ఎక్కడ వర్షం పడినాసరే ఇదే తీరు కనిపిస్తోంది. చిన్న చినుకు పడితే చాలు రోడ్లపై నీరు ప్రవహిస్తూ వాహనదారులకు, పాదాచారులకు తీవ్ర ఇబ్బందులను కలిగిస్తుంది. 1908లో హైదరాబాద్ నగరానికి భారీ వరదలు వచ్చి నగరం మునిగినప్పుడు వరదలను నివారించేందుకు అవసరమైన ప్రణాళికలను సూచించాల్సిందిగా మోక్షగుండం విశ్వేశ్వరయ్యను నిజాం కోరారు.మూసీతోపాటు దాని ఉపనదిగా ఉండే ఈసీ పై కొన్ని జలాశయాలను నిర్మించాలని ప్రతిపాదిస్తూ విశ్వేశ్వరయ్య ఓ ప్రణాళికను సిద్ధం చేశారు. మురుగునీటి పారుదలకు అవసరమైన సూచనలు చేశారు. అప్పుడు నిర్మించిన డ్రైనేజీ వ్యవస్థే ఇప్పటికీ చాలా పటిష్టంగా ఉంది అని బాల కిషన్ అన్నారు. కాకపొతే, దీనిని పూర్తిగా పునరుద్ధరించడం కూడా ప్రస్తుత పరిస్థితుల్లో సాధ్యం కాని పని అని ఆయన అంటారు. డ్రైనేజీ వ్యవస్థ పునరుద్ధరణ లోపం వల్లే వరదలు పోటెత్తుతున్నాయని అన్నారు.
బిక్కుబిక్కుమంటూ..
హైదరాబాద్లో ఇప్పుడున్న నాలా వ్యవస్థ రోజుకి 8 సెంటీమీటర్ల వర్షాన్ని మాత్రమే తట్టుకోగలదు. కాస్త భారీ వర్షం పడితే చాలు లోతట్టు ప్రాంతాలన్నీ పూర్తిగా జలమయం కాగా, రోజుల తరబడి జనాలు బురదలో బిక్కుబిక్కుమంటూ బతుకుతారు. హైదరాబాద్లో ఇప్పుడున్న నాలా వ్యవస్థ రోజుకి 8 సెంటీమీటర్ల వర్షాన్ని మాత్రమే తట్టుకోగలదు. కానీ 2020 అక్టోబరు నెలలో మాత్రం ఒక్కరోజే 19.2 సెంటీమీటర్ల వర్షం కురిసింది. దీంతో హైదరాబాద్ లోతట్టు ప్రాంతాలన్నీ పూర్తిగా జలమయం కాగా, రోజుల తరబడి జనాలు బురదలో బిక్కుబిక్కుమంటూ బతికారు. వర్షపు నీటి సమస్య ప్రతి ఏడాది ఉత్పన్నమవుతూనే ఉంది. ఈ సమస్యకు పూర్తి పరిష్కారాన్ని కనుగొనేందుకు నగరపాలక పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ కార్యాచరణ ప్రణాళికలను రూపొందిస్తోంది. ఇది ఎప్పుడు అమలు చేస్తారో చూడాలి.