Rainfall in Telangana : మరో ఐదు రోజులు వానలు: హైదరాబాద్ వాతావరణ కేంద్రం
అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో మరో 5రోజులు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. వాతావరణంలో వేడి, ఉక్కపోత ఉంటుందని తెలిపింది. ఇవాళ ప్రధానంగా సిరిసిల్ల, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, మంచిర్యాల, కొత్తగూడెం, కామారెడ్డి, సిద్దిపేట, మెదక్, భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని చెప్పింది. దీంతో అధికారులు ఎల్లో అలర్ట్ జారీ చేశారు.
ఇక వర్షంతో పాటు భారీగా ఈదురు గాలులు కూడా వీచే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. గంటకు 30-40 కి.మీ వేగంతో బలమైన ఈదురు గాలులు వీస్తాయన్నారు. కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తుందన్నారు. పిడుగులు పడే అవకాశం తక్కువగా ఉంటుందని చెప్పారు.
అయినా సరే.. వర్షం కురిసే సమయంలో ఇళ్ల నుంచి బయటకు రాకపోవటమే మంచిదని అధికారులు సూచిస్తున్నారు. హైదరాబాద్‌లో సాయంత్రం వర్షం కురిసే అవకాశం ఉన్నందున వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని చెబుతున్నారు.