తెలంగాణలో మళ్లీ వర్షాలు: వాతావరణ శాఖ
మొన్నటి వర్షాల నుంచే మహానగరం ఇంకా కోలుకోలేదు..;
మొన్నటి వర్షాల నుంచే మహానగరం ఇంకా కోలుకోలేదు.. మళ్లీ వర్షాలంటూ పిడుగు లాంటి వార్త చెప్పింది తెలంగాణ వాతావరణ శాఖ. బంగాళఖాతంలో ఉపరితల ఆవర్తనం ప్రభావంతో తెలంగాణలో ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయన్నారు. గురువారం, శుక్రవారం వానలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. శ్రీలంక తీరానికి సమీపంలో 3 కి.మీ ఎత్తువరకు ఉపరితల ఆవర్తనం ఏర్పడినట్లు వాతావరణ శాఖ తెలిపింది. హైదరాబాద్ సహా తెలంగాణ జిల్లాలపై దీని ప్రభావం ఉండే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. ఇప్పటికే భారీ వర్షాలకు భాగ్యనగరం అతలా కుతలమైంది. వందేళ్ల నాటి మూసి ఉప్పొంగిన వరద పరిస్థితులను కళ్లకు కట్టింది. జిల్లాల్లోనూ అనేక ప్రాంతాల్లో పంట నీట మునిగి రైతుల కష్టం వరదపాలైంది. మళ్లీ వానంటే ముఖ్యంగా హైదరాబాద్ వాసులకు వెన్నులో వణుకు మొదలవుతోంది.