RAINS: హైదరాబాద్‌లో దంచికొట్టిన వర్షం
హయత్‌నగర్‌లో ఇళ్లలోకి నీరు.. నీట మునిగిన లోతట్టు ప్రాంతాలు
హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో గురువారం సాయంత్రం కుండపోత వర్షం కురిసింది. ఆకాశానికి చిల్లుపడిందా అన్నట్లుగా.. నిమిషాల వ్యవధిలోనే రోడ్లన్నీ జలమయమయ్యాయి. వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. రహదారులపై మోకాళ్ల లోతు నీరు చేరడంతో ట్రాఫిక్ ఎక్కడికక్కడ నిలిచిపోయింది. ఎల్బీనగర్, వనస్థలిపురం, హయత్‌నగర్, అబ్దుల్లాపుర్ మెట్ తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. రామోజీ ఫిల్మ్‌సిటీ పరిసర ప్రాంతాల్లో గంటన్నరపాటు కుండపోత వర్షం కురిసింది.
భారీ ట్రాఫిక్ జామ్
భారీ వర్షానికి విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారిపై ట్రాఫిక్ నిలిచిపోయింది. రహదారిపై మోకాలి లోతు నీరు ప్రవహిస్తోంది. నగర శివారులోని హయత్‌నగర్ నుంచి సిటీవైపు వెళ్లే వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. పోలీసులు ట్రాఫిక్‌ను నియంత్రిస్తున్నారు.న రహదారిపై మోకాలి లోతు నీరు ప్రవహిస్తోంది. నగర శివారులోని హయత్‌నగర్ నుంచి సిటీవైపు వెళ్లే వాహనాలు నిలిచిపోయాయి. గంటల పాటు ట్రాఫిక్ స్తంభించిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ట్రాఫిక్ పోలీసులు ఎక్కడికక్కడ ట్రాఫిక్ ను క్రమబద్దీకరించారు. విరిగిపోయిన చెట్లను రోడ్లపైనుంచి తొలగించారు.
మెదక్‌లోనూ...
మెదక్ జిల్లాలోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. జిల్లా కేంద్రంలో మూడున్నరగంటల వ్యవధిలోనే 13 సెం.మీ వర్షపాతం నమోదైంది. రాజీపల్లిలో 9.2 సెం.మీ, పాతూర్‌లో 8 సెం.మీ మేర వర్షం కురిసింది. మెదక్ పట్టణంలోని రోడ్లన్నీ చెరువులను తలపిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. మెదక్ పట్టణంలోని గాంధీనగర్ కాలనీని వరద ముంచెత్తింది. వర్షం నీరు ఇళ్లలోకి చేరింది. మెదక్-హైదరాబాద్ హైవేపై భారీగా వరద నీరు చేరడంతో అధికారులు జేసీబీతో డివైడర్‌ను తొలగించారు. ప్రజలు అత్యవసరమైతేనే బయటకు రావాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. విద్యుత్ సరఫరా వ్యవస్థ అస్తవ్యస్తమయింది. వందలాది విద్యుత్ స్తంభాలు నేల కొరిగాయి, ట్రాన్స్ ఫార్మర్లు దెబ్బతిన్నాయి. సబ్ స్టేషన్లు డ్యామేజీ అయ్యాయి. మైనర్ ఇరిగేషన్ చెరువుల కట్టలకు, కాల్వలకు గండ్లు పడ్డాయి.
ఈ నెల 14 వరకు వర్షాలు
ఉపరితల ఆవర్తనం ప్రభావంతో తెలంగాణలోని పలు జిల్లాల్లో ఈ నెల 14 వరకు భారీ వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. వచ్చే నాలుగు రోజుల పాటు హైదరాబాద్‌లో వర్షాలు కురిసే అవకాశముందని అధికారులు పేర్కొన్నారు. ఆదిలాబాద్, కుమురంభీం, నిర్మల్, నిజామాబాద్, సిరిసిల్ల, భూపాలపల్లి, మహబూబాబాద్, సిద్దిపేట, మెదక్, కామారెడ్డి, జిల్లాల్లో పలు చోట్ల.. కుమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాల్లో వర్షాలు పడే అవకాశముందన్నారు. రాబోయే నాలుగు రోజులు రాష్ట్రంలో ఉరుములతో కూడిన భారీ వర్షాలు పడే అవకాశం ఉందని హెచ్చరించింది. ఈ మేరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.