RAINS: భారీ వర్షాలకు తెలుగు రాష్ట్రాలు అతలాకుతలం
తెలంగాణకు రెడ్, ఆంధ్రప్రదేశ్‌కు ఎల్లో అలెర్ట్;
రెండు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా గత వారం రోజుల నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. రోడ్లు నదులను తలపిస్తున్నాయి. రాబోయే మూడు రోజులు ఏపీలోని పలు జిల్లాల్లో భారీనుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఏలూరు, పశ్చిమ గోదావరి, కృష్ణా, ఎన్టీఆర్, బాపట్ల, పల్నాడు, గుంటూరు, ప్రకాశం, నంద్యాల జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. విజయవాడలో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా రెండు వేరు, వేరు ఘటనల్లో ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఓ ఘటనలో ఓ వ్యక్తి ప్రమాదవశాత్తు మ్యాన్‌హోల్‌లో పడి చనిపోయాడు. మృతుడ్ని 53వ డివిజన్ టీడీపీ అధ్యక్షుడు మధుసూదన్‌గా గుర్తించారు. రెండవ ఘటనలో కూలిన చెట్టును ఢీకొని ఓ వ్యక్తి చనిపోయాడు. భారీ వర్షాల కారణంగా చెట్టు కూలిపోయింది. అటువైపు వచ్చిన ఆ వ్యక్తిని చెట్టును ఢీకొన్నాడు. అక్కడికక్కడే చనిపోయాడు. ఈ సంఘటన లయోలా కాలేజీ దగ్గర జరిగింది. విజయవాడ సహా ఏపీ వ్యాప్తంగా భారీ వర్షాలు పడడంతో చాలా ప్రాంతాల్లో ట్రాఫిక్ స్తంభించింది.
తెలంగాణలో...
ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు నదులు, వాగులు, చెరువులు పొంగిపొర్లుతున్నాయి. ఎర్రుపాలెం మండలం కట్టలేరు చెక్ డ్యాంపై నుంచి వరద నీరు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. అదేవిధంగా మధిర- వైరా ప్రధాన రహదారిపై కృష్ణాపురం వద్ద పాలవాగు ఉప్పొంగి ప్రవహిస్తోంది. మరోవైపు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు సరిహద్దుగా ఉన్న మధిర మండలం చిలుకూరు సమీపంలోని కూడలి వద్ద వైరా నది, కట్టలేరు కలిసే సంఘమా ప్రాంతంలో వరద ప్రవాహం ఉద్ధృతంగా కొనసాగుతోంది. హైదరాబాద్‌లో మరోసారి భారీ వర్షం కురిసింది. పాతబస్తీలోని యాకుత్ పురా రైల్వే స్టేషన్ దగ్గరలోని వరద కాలువలో గౌస్ అనే యువకుడు పడిపోగా స్థానికులు కొద్ది దూరంలోని ఓ కాల్వలో చెత్తను తీస్తున్న హైడ్రా సిబ్బందికి సమాచారం ఇచ్చారు. దీంతో అక్కడకు చేరుకున్న సిబ్బంది సహాయక చర్యలు ప్రారంభించారు. అవకాశం లేని ప్రమాదకర పరిస్థితుల్లో నిచ్చెన కిందకు వేసి దాని ద్వారా యువకుడిని పైకి లాగారు. తెలంగాణలోని చాలా ప్రాంతాల్లోనూ భారీ వర్షాలు కురవగా సిబ్బంది సహాయ చర్యలకు దిగారు.
తెలంగాణకు రెడ్ అలెర్ట్
తెలంగాణ అంతటికీ నేడు రెడ్ అలర్ట్ జారీ చేసినట్లు వాతావరణ కేంద్రం డైరెక్టర్ నాగరత్న తెలిపారు. సంగారెడ్డి, వికారాబాద్, మెదక్, మేడ్చల్-మల్కాజిగిరి, యాదాద్రి భువనగిరి, ఖమ్మం, భద్రాద్రి, భూపాలపల్లి, ములుగు జిల్లాలకు రెడ్ వార్నింగ్ జారీ చేసినట్లు వెల్లడించారు. హైదరాబాద్, హనుమకొండ, ఆదిలాబాద్, జనగామ, కామారెడ్డి, కుమురం భీం, ఆసిఫాబాద్, మహబూబాబాద్, మంచిర్యాల, నల్గొండ, రంగారెడ్డి, సిద్దిపేట, వరంగల్ జిల్లాలకు ఆరెంజ్ వార్నింగ్ జారీ చేసినట్లు చెప్పారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. రాష్ట్రమంతటా నేడు కూడా వర్షాలు కొనసాగే అవకాశం ఉందని నాగరత్న వివరించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అత్యవరసమైతే తప్ప బయటకు రావద్దని సూచించారు. భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు కూడా పూర్తి అప్రమత్తంగా ఉన్నారు. 3 రోజుల పాటు అధికారులకు సెలవులను రద్దు చేశారు. అధికారులందరూ అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్ ఆదేశించారు.