బీజేపీలో చేరుతున్న వారికి గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ హెచ్చరికలు జారీ చేశారు. "బీజేపీలో చేరుతున్న వారికి స్వాగతం-సుస్వాగతం.. పార్టీలో చేరే ముందు కొన్ని మాటలు యాది పెట్టుకోండి, మరికొన్ని రాసి కూడా పెట్టుకోండి" అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బీజేపీలో చేరిన తర్వాత మీరు కోరుకున్నది మీ అసెంబ్లీ, మీ జిల్లా, మీ పార్లమెంటరీ నియోజకవర్గంలో జరగదు అని చెప్పారు. మీపైన విశ్వాసం పెట్టుకొని మీ కార్యకర్తలు బీజేపీలో చేరిన తర్వాత మీరు వారికి ఏ పదవి కూడా ఇప్పించలేరని పేర్కొన్నారు. బీజేపీలో చేరేముందు కొంతమందితో చర్చలు చేసుకొని రండి అని రాజా సింగ్ సూచనలు చేశారు. రాజా సింగ్ బీజేపీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. అధ్యక్ష పదవికి నామినేషన్ వెయ్యనివ్వలేని కారణంగానే రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించారు.
రామచందర్ రావు హౌస్ అరెస్ట్!
తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావును మంగళవారం పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. బంజారాహిల్స్ పెద్దమ్మ టెంపుల్కి వెళ్తారనే సమాచారంతో రామచందర్ రావును ముందస్తుగా పోలీసులు గృహ నిర్బంధం చేశారు. కొన్ని రోజుల క్రితం ఓ దుండగుడు పెద్దమ్మ ఆలయాన్ని ధ్వంసం చేయడంతో వివాదం నెలకొంది. పెద్దమ్మ టెంపుల్లో బీజేపీ నేతలు కుంకుమార్చన చేయాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలోనే ఆయన్ను ముందస్తుగా హౌస్ అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రామచందర్ రావు ఇంటివద్ద భారీగా పోలీసులు మోహరించి ఉన్నారు.