Rajgopal Reddy : తగ్గేదెలా అంటున్న రాజగోపాల్ రెడ్డి.. విమర్శలతో దూకుడు..
తెలంగాణ కాంగ్రెస్ లో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి హాట్ టాపిక్ గా మారారు. అస్సలు తగ్గేదెలా అన్నట్లుగా సొంత పార్టీ నేతల పైనే విమర్శలతో విరుచుకుపడుతున్నారు. సీఎం అయిన సరే...సీనియర్ అయిన సరే..వారి వ్యాఖ్యలను బహిరంగంగానే ఖండిస్తూ తరచూ వార్తల్లో నిలుస్తున్నారు.
మంత్రి పదవి ఆశించి భంగపడ్డ రాజగోపాల్ రెడ్డి పార్టీ పై, నేతలపై పలు విధాలుగా తన అక్కసు వెళ్లగక్కుతున్నారు. ఇటీవలే పదేళ్లు తానే సీఎం అని అన్న సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను తన ఎక్స్ ఖాతాలో ఖండించారు కోమటి రెడ్డి. అంతే కాకుండా తనను ఎల్ బీ నగర్ నియోజకవర్గం నుండి పోటీ చేస్తే మంత్రి పదవి ఇస్తామన్నారని ...కానీ తనకు మునుగోడు ప్రజలే ముఖ్యమని.. మంత్రి పదవి పై వ్యాఖ్యలు చేశారు.
కాగా మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు రాజగోపాల్ రెడ్డి. 'మనకీ మంచిరోజులు రాబోతున్నాయని ... ఎవరు తప్పు మాట్లాడినా నిర్మోహమాటంగా చెప్పేస్తాననని తాను ఏదైనా ఓపెన్ గానే మాట్లాడతానన్నారు. ఓ యూట్యూబ్ చానల్ తో మాట్లాడిన ఆయన.. రైతు భరోసా పై ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా స్టేట్మెంట్ ఇచ్చారు. రైతుభరోసా అందరికీ రాలేదని కొందరికే వచ్చిందని.. మిగతా వారికి కూడా రైతుభరోసా ఇవ్వాలని ప్రభుత్వానికి ఉన్నప్పటికీ ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి వల్ల ఆలస్యం అవుతున్నదన్నారు.
ఇలా పార్టీ పై , పాలన పై విమర్శలు చేస్తూ తెలంగాణ కాంగ్రెస్ లో దుమారం రేపుతున్నారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. మరో మూడు రోజుల్లో కేబినెట్ భేటీ ఉండనున్న నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలు ప్రాధాన్యత ను సంతరించుకున్నాయి. మనకు మంచి రోజులు రాబోతున్నాయని ఆయన వ్యాఖ్యానించగా..మంత్రి పదవి గురించే కావొచ్చనే పుకార్లు షికార్లు చేస్తున్నాయి. కాంగ్రెస్ అధిష్టానం పదవి ఇస్తుందా.. చర్యలు తీసుకుంటుందా అనేది చూడాలి.